కరోనా టెస్ట్‌ల ధరలు తగ్గించిన ఏపీ

ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా పరీక్షల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ఇది వరకు నిర్ణయించిన ధరలను సమీక్షించి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పంపిన శాంపిల్స్‌ను పరీక్షిస్తే ఒక్కో పరీక్షకు 2400 రూపాయలను ప్రైవేట్ ల్యాబ్ లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు ఆ ధరను 1600కు కుదించింది.

ప్రైవేట్‌ ల్యాబుల్లో పరీక్ష చేయించుకుంటే 2900 రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఇది వరకు ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు ఆ ధరను 19 వందల రూపాయలకు తగ్గించారు. ప్రస్తుతం టెస్ట్‌ కిట్లు భారీగా అందుబాటులోకి రావడం, మార్కెట్‌లో కరోనా కిట్ల ధరలు కూడా తగ్గిన నేపథ్యంలో ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ధరలు తగ్గించడం వల్ల ఎక్కువ మంది టెస్ట్ లు చేయించుకునే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.