టీడీపీ సలహాదారుడివి అని తెలుసు… కానీ ఇంత నిర్లజ్జగా తగునా రాధాకృష్ణ? – సోమువీర్రాజు

ఏపీలో టీడీపీకి, బీజేపీకి మధ్య అసలైన పోరాటం మొదలైనట్టుగా ఉంది. టీడీపీ మీడియా వ్యూహాత్మక దాడిపైనా ఏపీ బీజేపీ విరుచుకుపడుతోంది.

ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తన ఆర్టికల్‌లో జీవీఎల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ ద్వారా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఫైర్ అయ్యారు.

రాధాకృష్ణ తన వ్యాసంలో ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే దానికి జీవీఎల్‌ స్పందించడాన్ని తప్పుపట్టారు. జీవీఎల్ వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అవడమే కాకుండా బీజేపీకే నష్టం కలిగించేలా ఉన్నాయని… జీవీఎల్ వైసీపీ అధికార ప్రతినిధి తరహాలో వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలే వాపోతున్నారని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. ఎవరిని అడిగి జీవీఎల్ వైసీపీ ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదని బీజేపీ నేతలు వాపోతున్నారని రాశారు.

ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే స్పందించాల్సిన అవసరం జీవీఎల్‌కు ఏమిటి అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనుకునే పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని రాధాకృష్ణ విశ్లేషించారు. ఏపీలో బీజేపీ బలపడాలంటే జీవీఎల్‌ లాంటి వారిని ముందు అదుపు చేయాలని సలహా ఇచ్చారు. లేకుంటే మా జీవీఎల్ మా ఇష్టం అని మీరు అనుకుంటే మీ ఇష్టం అంటూ రాధాకృష్ణ తన ఆర్టికల్ లో రాశారు. దీనికి సోమువీర్రాజు బదులుగా లేఖ విడుదల చేశారు.

గతంలో ప్రధాని మోడీని, ఆయన కుటుంబాన్ని అడ్డగోలుగా టార్గెట్ చేసిన రాధాకృష్ణకు సడన్‌గా బీజేపీ పై ప్రేమ పుట్టినట్టుగా ఉందని మీ వ్యాసం ద్వారా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కానీ అది బీజేపీపై ప్రేమ కాదని…పతనం అంచున ఉన్న చంద్రబాబును, టీడీపీని రక్షించే ప్రయత్నమని చిన్నపిల్లలకు కూడా అర్థమవుతోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

రాధాకృష్ణ టీడీపీకి సలహాదారుడిగా పనిచేస్తున్నారని ప్రజల్లో వినికిడి అని… కానీ మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని బీజేపీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు.

రాధాకృష్ణ ఇలాగే సలహాలు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ రెండుమూడు సీట్లకు పడిపోవడం ఖాయమని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ విశ్లేషణలో అసలు మతలబు ఏమిటో… అసలు తాపత్రయం ఏమిటో బీజేపీ కేంద్ర నాయకత్వానికి త్వరలోనే వివరిస్తామని… దిగులుపడవద్దని రాధాకృష్ణకు వీర్రాజు కౌంటర్ ఇచ్చారు.