జగన్ ఎందులో గొప్ప…? ఎందుకు గొప్ప…?

దేశవ్యాప్తంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం జగన్ కి మూడో స్థానం దక్కింది.
తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి, ఏడాదిన్నర కాలం పూర్తికాకముందే.. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో మూడో స్థానం సంపాదించారంటే అది మామూలు విషయం కాదు.

సర్వేపై రాజకీయ ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆన్ లైన్లో ఓటింగ్ పెట్టి ఫేక్ ఓట్లతో నిర్వహించిన పోలింగ్ కూడా కాదు. సమగ్రంగా జరిగిన ఈ సర్వేలో జగన్ మహా మహుల్ని వెనక్కి నెట్టి మూడో స్థానం కైవసం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జగన్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నారు. ఐదో స్థానంలో ఎవరూ లేరు, ఆరో స్థానం బీహార్ సీఎం నితీష్ కుమార్ కి, ఎనిమిదో స్థానం నవీన్ పట్నాయక్ కి, తొమ్మిదో స్థానం కేసీఆర్ కి దక్కింది.

ఇక మొదటి స్థానంలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి సీఎం అయినా ఆయనకు మూడేళ్లు పాలనానుభవం ఉంది, అందులోనూ కేంద్రం అండదండలు ఎక్కువగా ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి.

ఇక రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రెండో దఫా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్రంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వుతుండే ఆయనకు దేశవ్యాప్తంగ అభిమానులుండటంలో విశేషమేమీ లేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాదిన్నర కాకమునుపే జగన్ కి ఆ స్థాయిలో గౌరవం దక్కడం ఒక్కటే ఇక్కడ వింత, విశేషం. అయితే ఇదేమీ ఆషామాషీగా అందిన విజయం కాదు.

కొత్త రాష్ట్రం, అప్పటికే అప్పుల్లోకి కూరుకుపోయింది, టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది. అయినా కూడా తన మార్కు చూపించుకోడానికి జగన్ కి ఏడాది కూడా టైమ్ పట్టలేదు. ఎన్నికల హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. అమ్మఒడి, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులు లాంటి సంచలన సంక్షేమ పథకాలన్నీ దేశవ్యాప్తంగా జగన్ కు పేరు తెచ్చాయి.

రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, దర్జీలు.. ఒకరేంటి జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందని పేదలెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. రివర్స్ టెండరింగ్ తో అవినీతి లేని సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఒకెత్తు అయితే కరోనా కష్టకాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి.

కరోనా టెస్ట్ కోసం తొలి దేశవాళీ టూల్ కిట్ మన రాష్ట్రంలోనే తయారైంది. ఓ దశలో దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే టెస్ట్ ల విషయంలో ఏపీ ముందుంది. కరోనా మరణాల రేటు అన్ని రాష్ట్రాలకంటే తక్కువ. ఇవన్నీ కేవలం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్లే. సచివాలయ వ్యవస్థతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు కరోనా ఇబ్బందుల్ని తొలగిస్తూ, పాలన సక్రమంగా సాగేలా చూశారు జగన్.

గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ఒకే సారి లక్షల మందికి ఉద్యోగావకాశాలు కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన నిర్ణయం. ఇక మూడు రాజధానుల ఏర్పాటుతో మరోసారి దేశవ్యాప్త సంచలనం సృష్టించారు జగన్.

రాష్ట్రంలో ఇది రాజకీయ కలకలం రేపినా దేశవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాన్ని హైలెట్ చేసింది. తలపండిన నేతలు సైతం తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, అమలు తీరులో అవినీతికి తావులేకుండా చేయడం జగన్ ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే జగన్ ఏడాదిన్న పాలనతోనే అందరినీ ఆకట్టుకోగలిగారు.