అమరావతిపై అధికార ప్రతినిధులకు బీజేపీ ఆదేశాలు

అమరావతి అంశంపై బీజేపీ అధికార ప్రతినిధులకు ఆ పార్టీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి అంశంతో పాటు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వివాదంపై టీవీచానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దని అధికార ప్రతినిధులకు ఆదేశించింది. బీజేపీ నిర్ణయాన్ని టీడీపీ గట్టిగా ప్రశ్నిస్తోంది.

అమరావతి అంశంపై అధికార ప్రతినిధులను మాట్లాడకుండా కట్టడి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అని బీజేపీని ఏబీఎన్ చానల్ ప్రశ్నించింది. అమరావతి శంకుస్థాపనకు హాజరైన పార్టీ ఇప్పుడు అమరావతిపై మాట్లాడకపోతే ఏమనుకోవాలని నిలదీసింది.

టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్న ఏపీ బీజేపీ నేతలకు చెక్ పెట్టేందుకు పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.

ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఆమోదించవద్దని గవర్నర్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడంపైనా బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది.

కన్నా, సుజనాతో పాటు కొందరు టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు టీడీపీ లైన్‌కు అనుకూలంగా చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుతున్నారు.

దీన్ని కట్టడి చేసేందుకే అమరావతి, నిమ్మగడ్డ ఎపిసోడ్‌ లపై నిర్వహించే చర్యల్లో పాల్గొనకుండా అధికార ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.