‘తెలంగాణలో పరిస్థితి ఆందోళనకరం… టెస్టులు పది రెట్లు పెరగాలి’

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 తీవ్ర రూపం దాలుస్తున్నదని… ఇప్పటికే హైదరాబాద్‌కు మూడు కేంద్ర ప్రభుత్వ బృందాలు వెళ్లి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు అన్నారు. దేశంలో అత్యధిక పాజిటివిటీ రేటు తెలంగాణలో ఉందన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఒక జాతీయ దినపత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.

  • తెలంగాణ ప్రభుత్వం కోవిడ్-19 విషయంలో ఎలా స్పందిస్తున్నదని మీరు ఒక కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శిగా అభిప్రాయపడుతున్నారు?

నాకైతే చాలా ఆందోళనకరంగా అనిపిస్తున్నది. అసలు కోవిడ్-19 విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నదో స్పష్టత లేదు. దేశంలో ఏ రాష్ట్రానికీ వెళ్లని విధంగా.. తెలంగాణకు మూడు కేంద్ర బృందాలు వెళ్లి పరిస్థితిని గమనించాయి. హైకోర్టు కూడా ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు సూచించింది. ప్రతిపక్షాలు రోజూ కరోనా వైరస్ ఎదుర్కునేందుకు తీసుకుంటున్న చర్యలను చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భయాందోళనగా ఉంది. దేశంలోనే అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్నప్పటికీ టెస్టింగ్ ల సంఖ్య మాత్రం పెంచడం లేదు.

  • వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

వైరస్ దేశంలో ప్రవేశించిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ టెస్టుల సంఖ్యను పెంచలేదు. అసలు వైరస్ వ్యాప్తిని గుర్తంచేందుకు సరిపడా టెస్టులు అసలు చేయలేదు. దీంతో తక్కువ కేసులు ఉన్నాయని భావించి విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. టెస్టుల సంఖ్యను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణలో వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే సమగ్రంగా, ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో అప్పుడే సమూహ వ్యాప్తికి చేరుకున్నట్లయితే పరిస్థితి చేయిదాటిపోతుంది. మొదటి నుంచే ఎక్కువ టెస్టులు చేయమని చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యతిరేకంగా స్పందించింది.

కరోనా మహమ్మారి తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైంది. లాక్‌డౌన్ సమయంలో కేసుల సంఖ్య తగ్గి ప్రభుత్వం అప్రమత్తం కావడానికి తగినంత సమయం దొరుకుతుందని అందరూ భావించారు. కానీ టెస్టులు చేయకపోవడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది. తెలంగాణలో 10 రెట్లు ఎక్కువ టెస్టులు చేయాల్సింది. అంతే కాకుండా టెస్టు ఫలితాలు కూడా 24 గంటల్లోపు వచ్చేలా చూడటంలో కూడా విఫలమయ్యింది.

  • అనుకోని ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యవస్థ ఉండాల్సింది?

తెలంగాణలో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఐఏఎస్, ఐపీఎస్‌లను ముందు పెట్టారు. వీళ్లు సమర్థవంతులై ఉండొచ్చు. వీరికి తెలివితేటలు బాగానే ఉండి ఉండవచ్చు. కానీ వైద్యారోగ్యంలో నిపుణులను పూర్తి స్థాయిలో వినియోగించుకోని ఉంటే బాగుండేది. ఇలాంటి వైరస్‌లు అకస్మాత్తుగా వ్యాప్తి చెందే సమయంలో సైన్సు గురించి సమగ్రంగా తెలిసిన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాల్సింది.

మరోవైపు రాష్ట్రం మొత్తానికి కలిపి గాంధీ ఆసుపత్రిని మాత్రమే కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చడం పెద్ద లోపం. అక్కడ పని చేసే వారికి సరైన రక్షణ పరికరాలు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవు. మరోవైపు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారికి కొద్ది పాటి లక్షణాలు ఉంటే వారికి టెస్టులు చేయలేదు. వాళ్లే బయటకు వెళ్లి వైరస్‌ను మరింతగా వ్యాప్తి చేసి ఉండొచ్చని అనుకుంటున్నాను.

  • ఏపీలో కోవిడ్ నియంత్రణ చర్యలు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే మేలుకున్నట్లు కనిపిస్తుంది. మొదటి నుంచి కాస్త మెరుగైన చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర శాఖల నుంచి సూచనలు రాకముందే ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. వాళ్లకు ఒక సాంకేతిక కమిటీ ఉంది, అత్యంత వేగంగా లక్ష టెస్టులు పూర్తి చేయగలిగారు.

అలాగే ప్రతీ ఇంటిపై నిఘా పెట్టగలిగారు. అనునిత్యం సీఎం జగన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేయగలిగారు. ప్రజలు ఆందోళన చెందకుండా సాధ్యమైనంతగా చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.

  • కోవిడ్-19ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఏమీ లేదంటారా?

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నియంత్రణలో విజయవంతమైనా, విఫలమైనా అవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిసమానంగా పంచుకోవాల్సిందే. దీనిలో ఇద్దరికీ భాగస్వామ్యం ఉంది. కేంద్రం ముందుగా ఎలాంటి సూచనలు ఇవ్వకుండా అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను వెనక్కు తీసుకొని రావడం , అలాగే వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లడానికి అనుమతులివ్వడం వంటి అనాలోచిత చర్యల వల్ల చాలా నష్టం వాటిల్లింది. వలస కూలీలు, కార్మికుల విషయంలో సరైన విధానం అవలంభించలేదు. కానీ సాధ్యమైనంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సమయంలో చేయగలిగిందే చేశాయి.

  • ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని మనం అరికట్టలేమా?

ప్రభుత్వం దగ్గర అధికారం ఉంది. కానీ ఈ ప్రైవేటు వ్యవస్థను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి సమగ్రమైన చార్జీలను నిర్ణయిస్తే బాగుండేది. భయంతో, పోలీసు వ్యవస్థతో అణచివేయాలని చూస్తే ప్రభుత్వాలు లక్ష్యాన్ని చేరుకోలేవు. సమాజానికి అవసరమైన విధానాలు రూపొందించి.. తమ పాలనలో మార్పును తీసుకొస్తే తప్ప ప్రైవేటు సెక్టార్ దోపిడీని మనం అరికట్టలేము.

  • ఇప్పుడు హైదరాబాద్‌లో పరిస్థితి చేయిదాటిపోయినట్లేనా?

ఇప్పుడు మనం పెద్దగా నష్టపోయిందేమీలేదు. ఇతర రాష్ట్రాల్లో లేని వసతులు, వైద్య సదుపాయాలు, సమర్థవంతమైన అధికారులు, మంచి వ్యవస్థ తెలంగాణలో ఉన్నాయి. ఫార్మా, ఐటీ, పౌర సమాజం అండదండలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి వైద్య నిపుణులతో చర్చించి.. సమగ్రవంతమైన గణాంకాలు తెప్పించుకొని దాని ప్రకారం ఒక వ్యూహాన్ని రచించాల్సి ఉంది.

ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఒక్క ప్రణాళిక సరిపోదు. బహుముఖ ప్రణాళికలతో సమర్థవంతంగా ప్రయత్నిస్తే తప్పకుండా కరోనాను ఎదుర్కోగలం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజల సహాయం ఎంతో అవసరం. అనవసర భయాందోళనకు గురి కాకుండా సాధ్యమైనంతగా వ్యవస్థను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాలి.