అబ్బే అది దగ్గు మందే… మాట మార్చిన పతంజలి

ఇటీవల కరోనాకు తాము మందు కనిపెట్టామని బాబారాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ప్రకటించుకుంది. కరోనా సోకిన వారు తమ మందు వాడి వారం నుంచి పదిరోజుల్లోనే కోలుకున్నారంటూ వెల్లడించింది. పతంజలి ప్రకటనపై వివాదం చెలరేగింది. కరోనా మాటున ప్రజలను దోపిడి చేసేందుకే ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని… అసలు కరోనాకు పతంజలి మందు పనిచేస్తుంది అన్న దానికి సాక్ష్యాలు ఎక్కడ అని పలువురు ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ ఆయూష్‌ సంస్థ కూడా పతంజలిని ఈ అంశంపై ప్రశ్నించింది. కరోనాకు మందు పనిచేస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? చేసిన ప్రయోగాలు, పరీక్షలకు సంబంధించిన వివరాలను తక్షణం సమర్పించాలని ఆదేశించింది. దీంతో పతంజలి సంస్థ మాట మార్చింది.

కరోనాకు తమ మందు పనిచేస్తుందని… వారంలో కరోనా నయం అవుతుందని మీడియా ముఖంగా చెప్పిన సంస్థ… ఇప్పుడు అలాంటిదేమీ లేదని ప్రకటించింది. తమ కరోనిల్‌ కరోనాకు మందుగా పనిచేస్తుందని తాము చెప్పలేదని మాట మార్చింది. తమది కేవలం దగ్గు మందు మాత్రమేనని అంగీకరించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి కూడా దగ్గు మందు అనే అనుమతులు తీసుకుంటున్నట్టు అంగీకరించింది.

కరోనిల్ కరోనాకు పనిచేస్తుందని ఎక్కడా చెప్పలేదని… కేవలం మందు ప్రయోజనాలను మాత్రమే వివరించామని ఇప్పుడు చెబుతోంది. కరోనాకు తమ మందు పనిచేస్తుందని తామెక్కడా కూడా చెప్పలేదని సీఈవో బాలకృష్ణ వెల్లడించారు.