కరోనా తో సాకర్ మహిళా రిఫరీ సావాసం

  • నర్సుగా సేవలు అందిస్తున్న ఫుట్ బాల్ రిఫరీ

సాకర్ క్రేజీ యూరోపియన్ దేశం స్పెయిన్ లో ఓవైపు కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంటే… మరోవైపు నిన్నటి వరకూ ఫుట్ బాల్ రిఫరీగా వ్యవహరించిన యువతులు ప్రస్తుతం నర్సులుగా అసాధారణ సేవలు అందిస్తున్నారు. తమ ప్రాణాలనే పణంగా పెట్టి కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్నారు.

స్పానిష్ యువతి ఇరాగార్జే ఫెర్నాండేజ్ వృత్తి నర్సు కాగా… ప్రవృత్తి మాత్రం ఫుట్ బాల్ రిఫరీగా మ్యాచ్ లు నిర్వహించడం. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ పాటిస్తున్న స్పెయిన్ లో ఫుట్ బాల్ కార్యకలాపాలు సైతం స్తంభించిపోయాయి.

ఇప్పటికే… స్పెయిన్ లో 56వేల మందికి కరోనా వైరస్ సోకగా …గత 24 గంటల్లోనే కరోనా వైరస్ దెబ్బతో 769 మంది మృతి చెందారు. మొత్తం 4 వేల 800 మరణాలు నమోదయ్యాయి. దీంతో…నిన్నటి వరకూ ఫుట్ బాల్ రిఫరీగా వ్యవహరించిన ఇరాగార్జే ఫెర్నాండేజ్… ఓ నర్సుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. బిలాబావోలోని రాకాల్డీ హెల్త్ సెంటర్లో గత
ఐదు సంవత్సరాలుగా ఫెర్నాండేజ్ నర్సుగా పనిచేస్తోంది.

ప్రస్తుతం జలుపు, దగ్గు, జ్వరం, తుమ్ముల వంటి లక్షణాలతో వచ్చే రోగులను పరీక్షించడం, కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలకు పంపుతోంది. తాను ప్రత్యేక మాస్క్ లు, దుస్తులు ధరించి రోగులను పరిక్షీస్తున్నా…కరోనా వైరస్ తో సహవాసం చేస్తున్నానని, ప్రాణాంతకమని తెలిసినా..ఈ కష్టకాలంలో రోగులకు అండగా నిలవాలని నిర్ణయించానని 26 ఏళ్ల ఫెర్నాండేజ్ చెబుతోంది.

కరోనా వైరస్ రోగులకు సమీపంలో ఉండే తమకు సైతం వైరస్ సోకే ప్రమాదం ఎంతో ఉందని గుర్తు చేసింది. గత 11 రోజులుగా తాము కరోనా వైరస్ తీవ్రతతో అతలాకుతలమైపోతూ వస్తున్నామని, తాను సూపర్ విమెన్ ను ఏమాత్రం కాదని… కేవలం ఓ సాధారణ నర్సుగా తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు చెప్పింది.