టోక్యో ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా

  • కరోనా ఒత్తిడితో ఎట్టకేలకు కీలక నిర్ణయం
  • లక్షలకోట్ల రూపాయల పెట్టుబడులకు కరోనా దెబ్బ

అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆలస్యంగానైనా చక్కటి నిర్ణయం తీసుకొంది. ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది కరోనా వైరస్ తాకిడితో విలవిలలాడిపోతుంటే.. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకూ టోక్యో నగరం వేదికగా 2020 ఒలింపిక్స్ నిర్వహించడంలో అర్థంలేదని గ్రహించింది.

టోక్యో ఒలింపిక్స్ ను సంవత్సరం పాటు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహక జపాన్ దేశప్రధాని షింజో అబే అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు థామస్ బెక్ తో సవివరంగా చర్చించిన అనంతరం పోటీల వాయిదా గురించి ప్రకటించారు.

నిర్వాహక సంఘానికి బాసటగా స్పాన్సర్లు…

ప్రపంచ వ్యాప్తంగా 140కి పైగా దేశాలకు విస్తరించి….3 లక్షల 77వేల మందికి సోకడంతో పాటు…16వేల 200 మందిని పొట్టనపెట్టుకొన్న కరోనా వైరస్ నివారణ కోసం.. భారత్ తో సహా పలుదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

దీనికితోడు వివిధ దేశాలప్రజలు, అథ్లెట్లు తీవ్రఒత్తిడిలో కూరుకుపోయిన నేపథ్యంలో ఒలింపిక్స్ ను రద్దు చేయాలన్న చారిత్రాత్మక నిర్ణయాని సంయుక్తంగా తీసుకొన్నామని, స్పాన్సర్లు సైతం తమకు పూర్తి సహకారం అందచేశారని జపాన్ ప్రధాని అబే, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు థామస్ బెక్ తెలిపారు.

ఒలింపిక్స్ నిర్వహణ కోసం 90వేలమంది వలంటీర్లు గత కొద్దిమాసాలుగా పాటుపడగా, వివిధ దేశాలకు చెందిన 11వేలమంది అథ్లెట్లు, వందలాదిమంది అధికారులు, సాంకేతిక నిపుణులు సిద్ధమయ్యారని, అయితే క్రీడలకంటే మనుషుల ప్రాణాలే తమకు ముఖ్యమని ఒలింపిక్స్ సంఘం స్పష్టం చేసింది.

ఊపిరిపీల్చుకొన్న అథ్లెట్లు….

టోక్యో ఒలింపిక్స్ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించవద్దంటూ గత కొద్దిరోజులుగా మొరపెట్టుకొంటూ వచ్చిన వివిధ దేశాల అథ్లెట్లు… పోటీలు ఏడాదిపాటు వాయిదా పడినట్లు తెలుసుకొని ఊపిరిపీల్చుకొన్నారు.

కరోనా వైరస్ భయంతో తాము మనస్ఫూర్తిగా సాధన చేయలేకపోయామని… క్రీడలు ఏడాదిపాటు వాయిదా పడటంతో ప్రశాంతంగా.. క్రీడలకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు భావిస్తున్నారు.

మరోవైపు భారత స్టార్ షట్లర్లు సైనా,సింధు, కశ్యప్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సైతం… ఒలింపిక్స్ వాయిదా వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

క్రీడల నిర్వహణ కోసం జపాన్ ప్రభుత్వం, నిర్వాహక సంఘం కలసి 12.6 బిలియన్ డాలర్ల భారీమొత్తాన్ని ఖర్చు చేశాయి. పోటీలు ఏడాదిపాటు వాయిదా వేయడంతో… లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.