అవే ట్రిక్స్‌… బాబు మారరా?

‘నాటి ఉగాదులేవి..? నాటి ఉషస్సులేవి..? అర్ధరాత్రి ఒంటరిగా కనుచూపుతో తుఫాన్లను ఆపిన నాటి ప్రతాపాలేవి..? తర్జని చూపి సముద్రాన్ని బెదిరించిన నాటి మహత్తులేవి..? ఏడీ, ఆ ట్రంపు కాల్ చేయడేమీ..? జిన్‌పింగ్ మరిచిపోయాడా ఏంటీ..? ఆఫ్టరాల్ కరోనాను మునివేళ్లతో తరిమేయనా ఏం..? ప్చ్, కాలం కలిసిరాకపోతే ఇంతేనేమో… ఖాళీ సాయంత్రాలు పక్కున నవ్వుతున్నాయ్… అలవాటైన ప్రాణాలు డమ్మీ కాన్ఫరెన్స్ వైపు తరుముతున్నాయ్… హతవిధీ.’

‘ప్రపంచ అధినేతలకు కరోన పై కరాటే… గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాను అన్న భ్రమలో ఉన్న చంద్రబాబు.’

పై రెండు కామెంట్స్….  చంద్రబాబు ట్విట్టర్‌ అకౌంట్‌లో ఫొటో చూసిన తర్వాత సోషల్‌ మీడియాలో నెటిజన్స్ స్పందించిన తీరు. ఇలాంటి ఫొటోల వల్ల మైలేజీ రావడం దేవుడెరుగు. ఇమేజ్‌ డ్యామేజీ మాత్రం అవుతుందని తెలుగు తమ్ముళ్లు తెగ వర్రీ అవుతున్నారు.

మా చంద్రబాబు మారరా? పబ్లిసిటీ పిచ్చితో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎన్నికల ముందు మనవడితో హుషారుగా ఆడే ఫొటో పెట్టారు. మీ సేవలు ఇక చాలు… మనవడితో ఆడుకోమని జనం తీర్పు ఇచ్చారు.

ఇప్పుడు కూడా కరోనాతో దాదాపు చాలామంది ఇంట్లో ఉంటే… జనానికి పనికొచ్చే మాటలు చెప్పకుండా… మళ్లీ పబ్లిసిటీ పిచ్చితో పిచ్చి ఫొటోలు పోస్టు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు పెట్టిన ఫొటోలపై సోషల్ మీడియాలో కామెంట్స్‌ పేలుతున్నాయి.

కరోనాపై పోరాటానికి మద్దతుగా మా కుటుంబం తరపున కరోనా నివారణకు, బాధితుల సహాయ చర్యలకు రూ.10లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారని చంద్రబాబు ప్రకటించారు.

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. సీట్లు ఖాళీ ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ చేస్తూ పెట్టిన ఫొటోనే ఇప్పుడు ట్రోలింగ్‌కు గురవుతోంది. అనవసరమైన ఆ ఫొటో వల్ల వచ్చే లాభం ఏం లేదు. అప్పటికే వీడియో విడుదల చేశారు. ఇలాంటి ఫొటోల వల్ల చంద్రబాబు ఇమేజీ ఇంకా పాతాళానికి పోతుంది తప్ప ఆయనకు పాజిటివ్‌ అయ్యే చాన్స్‌ లేదని తెలుగు తమ్ముళ్లు ప్రైవేటు సంభాషణలో తెగ మథనపడుతున్నారు.

కరోనాపై అందరూ మాట్లాడుతున్నారు. తాను మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడిపోతాననే భ్రమలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రచార యావతో ఇలా ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తున్నారని కొందరు అంటున్నారు.

తాను ఉండి ఉంటే రాత్రి 12 గంటల వరకు ప్రధాని ప్రెస్‌మీట్‌కు ముందు ఓప్రెస్‌మీట్‌…. ఆయన ప్రసంగం తర్వాత మరో ప్రెస్‌మీట్‌ పెట్టి గంటలు గంటలు మీడియాలో కవరేజీ దొరికేదని…ఇప్పుడు ఆ చాన్స్‌ మిస్‌ అయిందనే బాధ చంద్రబాబులో ఎక్కువ కన్పిస్తోందని ఆ పార్టీ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌లో అంటున్నారు.

అయితే ఎక్కడ నెగ్గాలో కాదో…ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు. ఇది 1999 నాటి కాలం కాదు… కాలం మారింది. దానికి తగ్గట్లుగా మారితే…. కొన్నేళ్ళు రాజకీయాల్లో ఉంటారు… లేకపోతే ఫేడ్‌ అవుట్‌ అవుతారని తెలుసుకోవాలని కొందరు హితవు పలుకుతున్నారు.