మారుతీరావు అనుమానాస్పద మృతి… హత్యా… ఆత్మహత్యా…?

తెలంగాణలో.. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు.. అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఖైరతాబాద్ లోని వాసవి భవన్ లో ఆయన మరణించినట్లుగా ఉన్న సన్నివేశం.. అనుమానాస్పదంగా కనిపిస్తోంది. మారుతీ రావు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే హత్య కాబడ్డాడా అన్నది తేలాల్సి ఉంది. హైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రణయ్ భార్య అమృతకు మారుతీ రావు తండ్రి. అమృత – ప్రణయ్ ప్రేమించి వివాహం చేసుకోవడాన్ని ఆయన అప్పట్లో సహించలేకపోయారు. అయినా.. అమృత మాత్రం తండ్రి మాట కాదని ప్రణయ్ తోనే ఉండేందుకు నిర్ణయించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రణయ్.. అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు.

ఈ ఘటనలో మారుతీ రావు తో పాటు అతని కుటుంబ సభ్యుల పై తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూశాయి. తన భర్త ప్రణయ్ ను చంపింది తన తండ్రి మారుతీరావే అంటూ.. అమృత తీవ్ర ఆరోపణలు చేసింది. కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేసింది.

2018 లో జరిగిన ఈ పరువు హత్య జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలకు తోడు.. అప్పట్లో మారుతి రావు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే… ఈ హత్యను కిరాయి హంతకులతో మారుతీరావు చేయించినట్టు అర్థమైంది.

నాటి నుంచి ఈ కేసులో విచారణకు హాజరవుతూ వస్తున్న మారుతీరావు.. ఇప్పుడు ఇలా అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు.