ప్రపంచ హాకీలీగ్ లో పోరాడి ఓడిన భారత్

  • తొలి అంచెలో 4-3 గోల్స్ తో నెగ్గిన ఆస్ట్ర్రేలియా

ప్రపంచ హాకీ లీగ్ రౌండ్ రాబిన్ తొలి అంచె పోటీలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో 4వ ర్యాంకర్ భారత్ పోరాడి ఓడింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో ఆస్ట్ర్రేలియా 4-3 గోల్స్త్ తో భారత్ ను అధిగమించింది.

కంగారూ ఆధిపత్యంతో సాగిన ఈ పోరు మొదటి భాగంలో 1-4 గోల్స్ తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత పుంజుకొని ఆడింది. గోల్ వెంట గోల్ సాధించింది. ఆట ముగిసే క్షణాలలో లభించిన పెనాల్టీ కార్నర్ ను సద్వినియోగం చేసుకొని ఉంటే …మ్యాచ్ ను 4-4 గోల్స్ తో డ్రాగా ముగించి ఉండేదే.

ఆస్ట్ర్రేలియా ఆటగాళ్లు డైలాన్ వూదర్ స్పూన్, టామ్ విక్ హామ్, షార్ప్, జేకబ్ యాండర్సన్ తలా ఒక గోలు సాధించారు. భారత ఆటగాళ్లలో రాజ్ కుమార్ 2 గోల్స్, రూపిందర్‌ పాల్ సింగ్ ఒక గోలు సాధించారు. రెండో అంచె పోటీలో మరోసారి ఈ రెండుజట్లే తలపడనున్నాయి.

లీగ్ తొలిరౌండ్లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసి…రెండోరౌండ్లో ప్రపంచ నంబర్ వన్ బెల్జియం ను నిలువరించిన భారత్…ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో మాత్రం పోరాడి ఓడక తప్పలేదు.

టోక్యో ఒలింపిక్స్ కు ఇప్పటికే అర్హత సంపాదించిన భారతజట్టు…గత ఏడాదికాలంగా నిలకడగా రాణించడం ద్వారా తన ర్యాంక్ ను 5 నుంచి 4కు మెరుగుపరచుకోగలిగింది.

గత దశాబ్దకాలంలో ప్రపంచహాకీ ర్యాంకింగ్స్ లో భారత్ సాధించిన అత్యుత్తమ స్థానం 4వ ర్యాంక్ మాత్రమే కావడం విశేషం.