ఏపీలో కాల్పుల క‌ల‌క‌లం…ఆర్మీ జ‌వాన్ ఘాతుకం….!

త‌న ప్రేమ‌కు ఓ అమ్మాయి ఒప్పుకోలేదన్న కార‌ణంతో ఆమె త‌ల్లిపైనే ఘాతుకానికి ఒడి గ‌ట్టాడో ఆర్మీ జ‌వాన్. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ ఆర్మీ జవాన్ మ‌హిళ‌పై కాల్పులు జరపడం కలకలం రేపింది.

జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లిలో రమాదేవి అనే మహిళపై ఆర్మీ జవాన్ బాలాజీ కాల్పులు జరిపాడు. రమాదేవి కూతురిని ప్రేమిస్తున్నానంటూ జ‌వాన్ ఆమె వెంటపడుతున్నాడు. అయితే అందుకు అమ్మాయి తల్లి రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బాలాజీ… ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి నాటు తుపాకీతో కాల్పులు జరిపి రమాదేవిని చంపేందుకు యత్నించాడు.

అయితే అతగాడి ఉన్మాద‌ చ‌ర్య‌ను ముందుగానే పసిగట్టిన స‌ద‌రు మహిళ… ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనలో ఆమె కుడి చెవికి బుల్లెట్ గాయమైంది.

కాల్పుల శ‌బ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో జ‌వాన్ బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే జ‌వాన్ కు సహకరించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. జ‌రిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.