ఢిల్లీలో ఎన్‌కౌంటర్… ఇద్దరు మృతి

ప్రశాంతంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్ ఉదంతం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ఢిల్లీవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే.. పలు కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న రాజా ఖురేషీ, రమేష్ బహద్దూర్ అనే ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు ఢిల్లీలోని ప్రహ్లాద్‌పూర్‌లో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. గత కొన్ని రోజులుగా పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.

పోలీసులకు వీరి ఆచూకీ గురించి స్పష్టమైన సమాచారం అందడంతో సోమవారం ఉదయం స్పెషల్ టీం వీరి కోసం గాలిస్తూ ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు వచ్చినట్లు గుర్తించిన దుండగులు వెంటనే కాల్పులకు తెగబడ్డారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య కొద్ది సేపు కాల్పులు జరిగాయి. కొంత సేపటికి దుండగుల వైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో పోలీసులు వెళ్లి అక్కడ పరిశీలించారు. ఇద్దరు దుండగులు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు కూడా పలు దొంగతనాలు, కిడ్నాపులు, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని కరవాల్‌నగర్ ప్రాంతంలో జరిగిన హత్యకేసులోనూ వీరు నిందితులు. పలు పోలీస్‌ స్టేషన్లలో వీళ్లు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌గా నమోదయ్యారు.