గణతంత్ర దినోత్సవం పండగలాంటిది

భారత్ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

గణతంత్రం అంటే “ప్రజలకే సర్వాధికారాలు, స్వేచ్ఛ ఉండే; ప్రజలు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే వ్యవస్థ. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు మహత్తరమైన అధికారం, స్వేచ్ఛ వచ్చాయి. అంతకు ముందు మనకు రాజ్యాంగం ఉండేది కాదు. ప్రజలకు స్వాతంత్ర్యం, అధికారం ఇచ్చే అవకాశం అప్పుడు లేదు. ఉన్న స్వేచ్ఛ కూడా పరిమితమైందే.

ప్రతి జనవరి 26న దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. దిల్లీలో ఇండియా గేట్ వద్ద భారీ స్థాయిలో గణతంత్ర దినోత్సవం జరుగుతుంది.

భారత రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. త్రివిధ దళాలు, పోలీసులు, ఎన్.సి.సి. కాడెట్ల వందనం స్వీకరిస్తారు. గణతంత్ర దినోత్సవాలకు ఏదో ఓ దేశాధినేతను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తాం. ఈ సారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి బ్రెజెల్ అధ్యక్షుడి బోల్సనారో.  దిల్లీలో జరిగే ఈ వేడుకలను చూడడానికి ఇతర దేశాల వారు కూడా హాజరవుతారు.

జనవరి 26 ఉదయాన్నే దిల్లీలో భారీ ఊరేగింపు ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. పదాతి దళం, నౌకా దళం, వైమానిక దళం సభ్యులతో పాటు ఎన్.సి.సి., ఎ.సి.సి., బాయ్ స్కౌట్స్, గర్ల్ గైడ్స్ ఈ కవాతులో పాల్గొంటారు.

ఈ సందర్భంగా మన ఆయుధ సంపత్తిని కూడా ప్రదర్శిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల్లో ఆ రాష్ట్రాల ప్రత్యేకత చాటి చెప్తారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా ఈ ప్రదర్శనలో శకటాలను చేరుస్తాయి.

చివరకు రంగు రంగుల గాలి బుడగలను ఆకాశంలోకి వదులుతారు. విమానాలు త్రివర్ణ పతాకానికి చిహ్నంగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వాయువులను వెదజల్లుతాయి. ఈ సందర్భంగా దేశభక్తి వెల్లి విరుస్తుంది. దానితో పాటు దేశ సమైక్యత వ్యక్తం అవుతుంది.

దిల్లీలోనే కాక దేశంలోని వివిధ ప్రాంతాలలో పాఠశాలల్లో ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తారు.

కవాతులతో పాటు, వ్యాయామ ప్రదర్శన, ఉపన్యాసాలు, పాటలు, నైపుణ్య ప్రదర్శన కూడా ఉంటాయి. విచిత్ర వేష ధారణ కూడా ఉంటుంది. ఈ ఉత్సవాలలో ఉపన్యసించే వారు స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్య యోధుల గురించి వివరిస్తారు. దేశానికి సేవ చేయాలని ఉద్బోధిస్తారు.

గణతంత్ర దినోత్సవం పండగలాంటిది. ప్రజల్లో దేశభక్తి భావన పెంచుతుంది. స్వాతంత్ర్య యోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఇదో సందర్భం. గణతంత్ర దినోత్సవం పౌరుల బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. భారతీయులం అన్న గౌరవ భావనను నిపుతుంది.