ఊహలకే పరిమితం కావడం భ్రమే

ఎన్నికల నిపుణులు, వ్యాఖ్యాతలు ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తారు, ఊహిస్తారు. ఇక్కడ ఆ ప్రస్తావన చేయడం లేదు. లేదా పోలింగ్ ముగిసిన తరవాత నిర్వహించే ఎన్నికల సర్వేల గురించి కూడా ఇక్కడ మాట్లాడడం లేదు. సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రజల మానోభావాలు ఎలా ఉన్నాయో గమనించి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించే ప్రయత్నం చేస్తారు.

ఇలా ఊహించడం రాజకీయాల్లో ఒక పార్శ్వానికి వర్తించవచ్చు కానీ మరో పార్శ్వానికి అసలే వర్తించకపోవచ్చు. ఈ “ఊహ” అనే మాటనే మనం భిన్న కోణంలోంచి చూడాలి. అప్పుడే పార్టీ రాజకీయాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారం సంపాదించడమే. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో రాజకీయ పార్టీల ఊహలు ఎన్నికల నిపుణుల, విశ్లేషకుల ఊహలకు పూర్తి భిన్నంగానూ ఉండవచ్చు. ఓటర్లు ఏ దిశగా ఆలోచిస్తారో గమనించి రాజకీయ పార్టీల వారు ఫలితాలు ఎలా ఉంటాయో ఊహిస్తుంటారు. ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేస్తారు.

ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా వరకు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయలకు అనుగుణంగా ఊహిస్తుంటాయి. అయితే వారి అంచనాలు ఓటర్ల సమీకరణకు పూర్తి భిన్నంగా ఉండవచ్చు. కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లు ఎన్నికల తరవాత ఎదుర్కునే సమస్యల ఆధారంగా ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించడానికి ప్రయత్నిస్తాయి. ఓటర్లు ఒక రాజకీయ పార్టీ ఓటర్ల అభిప్రాయాన్ని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో అన్న విషయం ఆధారంగా ఆలోచిస్తారు. 2014, 2019 ఎన్నికలలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, బూటకపు వాగ్దానాలు చేయడం, తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టడం మరీ మాట్లాడితే పచ్చి అబద్ధాలు చెప్పడం మీద ఆధారపడే జరిగాయి.

ప్రచారంలో ఉన్న అసత్యాలను ప్రజలు ఎలా తీసుకుంటారు, తాము మోసపోవడానికి సిద్ధంగా ఉంటారా అన్నది వారి మేధా సంపత్తిపైన, వారి సాంస్కృతిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడానికి అదనపు సమాచారం ఏదీ అడగరు. వారికి మేధా శక్తి ఉండాలి. భావోద్వేగాలను ప్రేరేపించే జాతీయతావాదం మొదలైనవి ఓటర్లను ఆకట్టుకోవచ్చు. ఒక్కో సారి ఓటర్లలో ఉన్న చిరాకు అసత్యాలను నమ్మడానికి కూడా దారి తీయవచ్చు. దీనికి ఎంతో కొంత హేతుబద్ధత ఉండవచ్చు. ఈ లక్షణాల ద్వారా ఎన్నికల ఫలితాలను ఊహిస్తుంటారు.

2014, 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అనుభవంలోకి వచ్చింది ఇదే. 2014 ఎన్నికలలో బీజేపీ ప్రధానంగా వాగ్దానాల మీద ఆధారపడింది. 2019లో జనాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచడానికి భావోద్వేగాలనే ఆశ్రయించింది. ఇలాంటప్పుడు సంవాదాలు, చర్చలు, సంప్రదింపులకు రాజకీయాల్లో స్థానం ఉండదు.

ఇలాంటి సందర్భాలలో బీజేపీ లాంటి పార్టీ తమ ప్రభుత్వం అనుసరించే విధానాలు ప్రజానుకూలమైనవని, తాము చేస్తున్న చట్టాలు మంచివేనని, దేశం అంటే ప్రభుత్వానికి ఉన్న భావన అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటుంది. ఇలాంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు చలన శీలమైన, దాపరికంలేని విధానాలకు ఆస్కారమే ఉండదు. అదీ గాక దాపరికం లేని రాజకీయాలు అనుసరించే ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కూడా బీజేపీలాంటి పార్టీలు అనుకోవు.

ఈ విధానం వల్ల మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియే ఎందుకూ కొరగాకుండా పోతుంది. ఓటర్లు, ఆ ఓటర్లు ఉండే ప్రాంతాలు ఇలాంటి పార్టీల చేతిలో కేవలం పరికరాలుగా దిగజారిపోతాయి. తామే దీర్ఘ కాలం అధికారంలో ఉండాలని అనుకుంటారు. అందుకే ఓటర్లు హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయానికి రావడానికి ఆస్కారమే ఉండదు. ప్రజల ఆత్మగౌరవానికి ఎలాంటి విలువా ఉండదు. ఇలాంటి పార్టీలు ప్రజల ఓటుకు ఏ విలువా ఇవ్వవు. ఓటర్లను, ఓట్లను కేవలం తమ గుప్పెట్లోని పరికరాలుగా మార్చేస్తారు.

అయితే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సుదీర్ఘ కాలం ఏ ఒక్క పార్టీ అధికారం కొనసాగడానికి అవకాశం ఉండదు అని నిరూపించాయి. రాజకీయాలను తమ గుప్పెట్లో మాత్రమే పెట్టుకోవాలని చూడడం ఇబ్బందుకు దారి తీస్తుంది. వాస్తవంలో ఓటింగు జరిగినప్పుడు అధికార పార్టీ అంచనాలు తలకిందులైనాయి. అందుకే ఓటర్ల మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకోగలమని, ఎన్నికల ఫలితాలు తమ ఊహకు అనుగుణంగా మాత్రమే ఉంటాయి అనుకునే వారు దీర్ఘ కాలం మరీ మాట్లాడితే శాశ్వతంగా అధికారంలో కొనసాగగలమన్న భ్రమలో ఉండకూడదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)