సీఏఏ ఆందోళన నేపథ్యంలో…. కీలక ప్రకటన చేసిన కేంద్ర హోం శాఖ

పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమంటూ లక్షలాది మంది విద్యార్థులు, పౌర కార్యకర్తలు, విపక్షాలు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై కీలక ప్రకటన వెలువరించింది. ఎన్‌సీఆర్‌పై వస్తున్న వదంతులపై వివరణ ఇచ్చింది. పౌరసత్వం గురించి దేశంలో ఏ పౌరుడిని కూడా వేధించబోమని హోం శాఖ స్పష్టం చేసింది. ధృవీకరణ పత్రాలు సమర్పించే సమయంలో ఇబ్బందులు పెట్టమని చెప్పింది.

దేశంలో కోట్ల సంఖ్యలోనే నిరక్ష్యరాస్యులు ఉన్నారు.. వారి వద్ద సరైన ధృవీకరణ పత్రాలు ఉండకపోవచ్చు. ఇదే విషయాన్ని కేంద్రానికి విన్నవించగా.. అటువంటి వారి కోసం ఇతర సాక్ష్యాలు లేదా స్థానికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాలు ఇవ్వొచ్చని తెలిపింది.

భారత పౌరులుగా నిరూపించుకోవాలంటే పుట్టిన తేదీ ధృవీకరణ లేదా స్థానిక నివాస ధృవీకరణ పత్రాలు ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఇలాంటి పత్రాల జాబితాను రూపొందించామని వాటిలో ఏవైనా ఇవ్వొచ్చని కేంద్ర హోం శాఖ చెబుతోంది.