డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ కు భారత్ అర్హత

  • పాక్ పై 4-0తో భారత్ తిరుగులేని విజయం

ప్రపంచ టీమ్ పురుషుల చాంపియన్లకు ఇచ్చే డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ అర్హత రౌండ్ కు మాజీ రన్నరప్ భారత్ చేరుకొంది. కజకిస్థాన్ రాజథాని నూర్ సుల్తాన్ వేదికగా ముగిసిన రెండురోజుల ఆసియా-ఒషియానా జోన్ రౌండ్ పోటీలో భారత్ 4-0తో పాకిస్థాన్ ను చిత్తు చేసింది.

నూర్ సుల్తాన్ తటస్థ వేదికగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్వహించిన ఈ పోరు లో యువఆటగాళ్లతో కూడిన పాక్ జట్టు భారత్ కు ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది.

రెండుజట్లూ వివిధ కారణాలతో పలువురు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది.

తిరుగులేని భారత్..

పోటీల తొలిరోజున జరిగిన ప్రారంభ సింగిల్స్ లో భారత ఆటగాళ్లు రామ్ కుమార్ రామనాథన్, సుమిత్ నగాల్ తమ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించడం ద్వారా 2-0తో విజయానికి మార్గం సుగమం చేశారు.

పోటీల రెండో రోజున జరిగిన కీలక డబుల్స్ సమరంలో భారతజోడీ లియాండర్ పేస్- జీవన్ నెడుంజెళియన్ కేవలం 53 నిముషాలలోనే పాక్ యువజంట రెహ్మాన్- మహ్మద్ షోయబ్ లను 6-1, 6-3తో చిత్తు చేసి 3-0తో విజయం ఖాయం చేశారు.

తొలి రివర్స్ సింగిల్స్ లో సైతం భారత ఆటగాడు సుమిత్ నగాల్ విజయం సాధించడంతో.. ఆఖరి రివర్స్ సింగిల్స్ ఆడకుండానే పోటీ ముగిసింది.

పాక్ పై భారత్ 7-0

పాక్ ప్రత్యర్థిగా డేవిస్ కప్ సమరంలో ఇప్పటి వరకూ ఏడుసార్లు తలపడిన భారత్ కు ఇది వరుసగా ఏడో గెలుపుకావడం విశేషం. 2013 తర్వాత తొలిసారిగా తలపడిన ఈ పోరులో భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

2014 లో చైనీస్ తైపీ పై 5-0 విజయం సాధించిన తర్వాత భారతజట్టు డేవిస్ కప్ పోరులో నాలుగు మ్యాచ్ లు నెగ్గడం ఇదే మొదటిసారి.

ఈ విజయంతో..12 జట్ల ప్రపంచ గ్రూప్ ఫైనల్ రౌండ్ కు భారత్ అర్హత సాధించగలిగింది. మార్చి మొదటివారంలో జరిగే పోరులో క్రొయేషియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

పాకిస్థాన్ పై భారత్ సాధించిన ఈ విజయాన్ని అమరులైన భారత సైనికదళాలకు అంకితమిస్తున్నట్లు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్ పాల్ ప్రకటించారు.