ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య.. పరిస్థితి ఉద్రిక్తం

ఆర్టీసీ సమ్మె నేటికి 24వ రోజుకు చేరినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సానుకూల వాతావరణం ఏర్పడక పోవడంతో కార్మికులు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారు. ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా.. తాజాగా ఒక ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న 31 ఏళ్ల నీరజ ఇవాళ తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యలు చెబుతున్నారు. కండక్టర్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న కార్మికులు సత్తుపల్లి డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరి వల్లే నీరజ చనిపోయిందంటూ నినాదాలు చేశారు.

కాగా, దీపావళి పండుగ నిమిత్తం పల్లిపాడులోని పుట్టింటికి వెళ్లిన నీరజ.. ఇవాళ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంది.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఖమ్మంలోని తన ఇంటికి తిరిగి వచ్చింది.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని నీరజ ఇంటికి భారీ సంఖ్యలో కార్మికులు, నాయకులు తరలివచ్చారు.