ఆదివారం తెలంగాణ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో ముహూర్తం ఖ‌రారు చేశారు. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు.

రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైన తమిళ సై సౌందరరాజన్ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియచేశారు.

ఇటు స‌ర్కార్‌లో అన్ని ర‌కాల ప‌ద‌వుల‌ను పూర్తిస్థాయిలో భ‌ర్తీ చేసే చ‌ర్య‌లు చేప‌ట్టారు. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేయాలని సిఎం నిర్ణయించారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్ లుగా నియమించే ఆలోచనలో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ సీనియర్ నాయకులు మధుసూదనా చారి, జూపల్లి కృష్ణారావు లకు త్వరలోనే ఉన్నత పదవులు ఇవ్వాలని సీఎం నిర్ణయానికి వచ్చారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహరెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులకు కూడా ఉన్నతమైన పదవులిస్తార‌ని స‌మాచారం.

వీరిలో కొందరికి రాజ్యసభ సభ్యత్వం, మరికొందరికి ఆర్టీసీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ లాంటి పదవులు దక్కే అవకాశం ఉంది.