వరద ప్రాంతాల్లో సహాయానికి…. వాలంటీర్లను వాడుకోండి

గడచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరి నదితో పాటు రాష్ట్రంలోని ఇతర నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి పొంగుతోంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర నదులు ప్రవహించే జిల్లాల్లో కూడా వరద నీరు భారీగా తరలి వస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లి లోని సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో వరద ముంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వంశధార, నాగావళి నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కూడా తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మంచినీటి వసతులను ఏర్పాటు చేయాలని, వరద పాలిట పడ్డ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

గడచిన రెండు నెలల్లో ఐదు వందల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసి పోయినట్లుగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ వద్ద నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు అధికంగా చేరటంతో గోదావరి నదికి ఈ పరిస్థితి ఎదురైందని అధికారులు వివరించారు.

రానున్న మూడు రోజులలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు లేవని, దీనివల్ల పరిస్థితులు చక్కబడతాయని అధికారులు వివరించారు. ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే ఎంపిక చేసిన గ్రామ వలంటీర్ల సేవలను కూడా వినియోగించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వరదల అనంతరం ఏర్పడే అనారోగ్య సమస్యలపై కూడా చర్యలు తీసుకోవాలని, వైద్య బృందాలను ముంపు ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.