రెండు సినిమాలతో పోటీపడుతున్న ‘కొబ్బరిమట్ట’ 

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మారారు. అయితే ఆ తరువాత రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 లో కనిపించిన సంపూ తర్వాత ‘కొబ్బరిమట్ట’ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. రూపక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి తాజాగా ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోంది.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ‘ఆండ్రాయిడ్’ పాట మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి సరిగా సింగల్ షాట్ లో తీసిన మూడున్నర నిమిషాల డైలాగ్ వీడియో, సినిమాపై ఆసక్తిని పెంచాయి. కానీ సరిగ్గా ‘కొబ్బరిమట్ట’ విడుదలకు ఒక్కరోజు ముందు రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఒకటి నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మన్మధుడు 2’ సినిమా. మరొకటి అనసూయ హీరోయిన్ గా నటించిన ‘కథనం’. ఈ రెండూ ఆగస్టు 9వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ‘కొబ్బరిమట్ట’ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు ‘కొబ్బరిమట్ట’ చిత్ర దర్శకనిర్మాతలు విడుదలకు ఒక రోజు ముందు ఇండస్ట్రీలోని కొందరికి ఈ సినిమా ప్రీమియర్ ను ఏర్పాటు చేశారు. మరి ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.