మ‌నిషి పామును క‌రిచాడు

“కుక్క మ‌నిషిని క‌రిస్తే వార్త కాదు. మ‌నిషి కుక్క‌ను క‌రిస్తే వార్త‌వుతుంది”అంటూ జ‌ర్న‌లిజం స్టూడెట్స్‌కి మొద‌టి పాఠంగా చెబుతుంటారు. అదే నిజ‌మైతే ఇదీ వార్తే. కాక‌పోతే ఇక్క‌డ కుక్క‌ను క‌రిచే బ‌దులు పామును క‌రిచాడు మ‌నిషి. అంతే తేడా.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఇటా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువ‌కుడు త‌న‌ను కాటేసిన పామును తిరిగి కాటేసి మూడు ముక్క‌లు చేశాడు. 28 జులై రాత్రి ఒక పాము రాజ్‌కుమార్ అనే యువ‌కుని ఇంట్లోకి ప్ర‌వేశించి అత‌డ్ని కాటేసింది. రాజ్‌కుమార్ అప్ప‌టికే బాగా మ‌ద్యం సేవించి ఉన్నాడు. పాము కాటేసినందుకు కోపోద్రిక్తుడ‌య్యాడు. మ‌ద్యం నిషాలో పామును ప‌ట్టుకుని నోటితో క‌రిచి మూడు ముక్క‌లు చేశాడు.

ఈలోపు పాము విష‌ప్ర‌భావం వ‌ల్ల అత‌డి ఆరోగ్యం దెబ్బ‌తిన‌డం ప్రారంభించింది. డాక్ట‌రు ద‌గ్గ‌రకు ప‌రుగెత్తాడు.

“నా కొడుకు తాగి ఉన్నాడు. ఒక పాము ఇంట్లోకి ప్ర‌వేశించి అత‌డ్ని క‌రిచింది. అత‌డూ ఆ పామును క‌రిచి చంపేశాడు. ఇప్పుడు నా కొడుకు ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంది. వైద్య‌ఖ‌ర్చులు భ‌రించ‌లేని స్థితిలో ఉన్నాం” అని తండ్రి బాబూ రాం అన్నాడు.

“ఒక పేషెంట్ నాద‌గ్గ‌రికి వ‌చ్చాడు. పామును క‌రిచాన‌ని చెప్పాడు. నేను పామే అత‌డ్ని క‌రిచింద‌ని, అత‌డు పొర‌పాటుగా మాట్లాడుతున్నాడ‌ని అనుకున్నాను. అత‌డి ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌టంతో వేరే హాస్పిట‌ల్‌కి వెళ్ల‌మ‌ని చెప్పాను” అని ముందుగా చికిత్స చేసిన డాక్ట‌ర్ విలేక‌రుల‌కు వివరించాడు.

మ‌నిషి పామును క‌ర‌వ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇటువంటి ఉదంతం ఈ మ‌ధ్య గుజ‌రాత్‌లో కూడా జ‌రిగింది. మ‌హిసాగ‌ర్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల ప‌ర్వ‌త్ గ‌లా బారియా అనే రైతు త‌న పొలంలో ప‌నిచేసుకుంటూ ఉంటే ఒక పాము అత‌డ్ని క‌రిచింది.

దీంతో ఎట్లాగైనా ఆ పాముని చంపాల‌నే కోపంతో దాన్ని ప‌ట్టుకుని… క‌సా క‌సా న‌మిలిప‌డేశాడు. చ‌నిపోయిన పాముని అత‌డి బంధువు కాల్చాడ‌ని రైతు కోడ‌లు విలేక‌రుల‌తో చెప్పింది.