ఎంతమంది చెప్పినా ఆయన చెవికి ఎక్కలేదు

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని చుట్టూ ఉన్న కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించిన కట్టడాలన్నీ అక్రమమైనవేనని, ఈ కట్టడాల కారణంగా పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతింటుందని ప్రముఖ పర్యవరణ వేత్త గాంధీ అన్నారు.

“ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల కారణంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది” అని పర్యావరణవేత్త గాంధీ స్పష్టం చేశారు.

కృష్ణా నది పరివాహక ప్రాంత కరకట్టలపై వెలసిన కట్టడాలు, కొత్త ప్రభుత్వం వాటిని కూల్చి వేయడం వంటి అంశాలపై ఓ చానల్ లో జరిగిన చర్చాగోష్టిలో గాంధీ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల కారణంగా పర్యావరణం దెబ్బ తినడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చే అవకాశం ఉందని గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరకట్టలపై నిర్మాణాలు చేపట్టరాదని పర్యావరణ వేత్తలు ఎంత హెచ్చరించినా చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టాడని గాంధీ మండిపడ్డారు.

వాటర్ మాన్ గా పేరు తెచ్చుకున్న రాజా సింగ్ 2015 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పర్యటించారని, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వాటర్ మాన్ రాజా సింగ్ పై దాడులు చేయించారని గాంధీ ఆరోపించారు.

“కరకట్టల పై నిర్మాణాలు ప్రమాదకరం. వాటిని వెంటనే నిలిపివేయండి. ఈ నిర్మాణాల కారణంగా భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వాటికి నైతిక బాధ్యత మీరే వహించాలి” అని వాటర్ మాన్ రాజా సింగ్ ఆ సమయంలో హెచ్చరించారని చర్చాగోష్టి సందర్భంగా గాంధీ తెలిపారు.

కరకట్టలపై నిర్మాణాలను తొలగించడం ముమ్మాటికి మంచిదేనని, ఈ చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాను అభినందిస్తున్నానని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే పోతులూరి వీరబ్రహ్మం గారు భవిష్యవాణిలో చెప్పినట్లుగా కృష్ణానది పొంగి పొరలి విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకను అందుకునేదని పర్యావరణవేత్త గాంధీ అన్నారు.