మరో రీమేక్ లో సమంత

రానురాను రీమేక్ సినిమాలకు కేరాఫ్ గా మారుతోంది సమంత. క్యారెక్టర్ బాగుంటే ఏ భాషలో సినిమాకైనా రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఓ బేబీ సినిమా కూడా రీమేకే. కొరియన్ భాషలో తెరకెక్కిన మిస్ గ్రానీ సినిమాను తెలుగులో ఓ బేబీగా తీశారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మరో రీమేక్ పై ఫోకస్ పెట్టింది సమంత.

తమిళ్ లో హిట్ అయిన 96 రీమేక్ ను ప్రారంభించబోతోంది సమంత. ఈ వారంలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఆ షెడ్యూల్ లో జాయిన్ కాబోతోంది సమంత. మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. శర్వానంద్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిచారు. త్వరలోనే ప్రారంభంకాబోతున్న రెండో షెడ్యూల్ లో శర్వానంద్-సమంతపై సన్నివేశాలు తీయబోతున్నారు.

తమిళ్ లో ఒరిజినల్ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్, ఈ రీమేక్ తో తెలుగుతెరకు పరిచయమౌతున్నాడు. అయితే తెలుగు వెర్షన్ కు మాత్రం చాలా మార్పులు చేశారు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ ను పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.