జగన్ సీఎం అయితే వీళ్లు రాష్ట్రాన్ని వదలి వెళ్తారట..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది ఈ నెల 23న కాని తెలియదు. కాని ఇప్పటికే పలు సర్వేలు, విశ్లేషణల్లో జగన్ గెలుస్తాడనీ.. సీఎం అవుతాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి ముందస్తు ప్రయత్నాలు చేసుకుంటున్నారట.

గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా పని చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కొందరు చంద్రబాబు అనూనయులుగా పేరు తెచ్చుకొని కీలక పోస్టులలో చేరారు. ప్రతీ దశలోనూ ప్రతిపక్ష వైసీపీకి వ్యతిరేక వైఖరి అవలంభించారని చాలా మంది అధికారులపై ఆరోపణలు ఉన్నాయి.

అందుకే ఎన్నికల సమయంలో సీఎస్‌తో సహా ముఖ్య అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఇలాంటి ఉన్నతాధికారులు ఇప్పుడు జగన్ సీఎం అయితే తమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని రాష్ట్రం వదలి కేంద్ర సర్వీసులకు వెళ్లాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కొంత మంది కేంద్ర సర్వీసుల కోసం దరఖాస్తులు కూడా చేసుకున్నారని సమాచారం.

మరోవైపు, చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రానికి రావడానికి ఇష్టపడని కొంత మంది కేంద్ర సర్వీసు అధికారులు.. జగన్ సీఎం అయితే ఇక్కడ పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఈ నెల 23 తరువాత ఏం జరుగతుందో…!