నాగార్జున ఆస్తులను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?

హీరో నాగార్జున భూముల వ్యవహారం పై హీరోయిన్‌ విజయశాంతి సంచలన కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఆకర్షించడానికి ఏదో చేస్తున్నట్లు హడావిడి చేస్తారని తీరా ఏమీ ఉండదని…. ఏదో అవుతుందనుకుంటే…. చివరకు తుస్సుమంటుందని కేసీఆర్‌ పై వ్యంగ్యంగా విమర్శలు చేశారు.

నయీమ్‌ను ఎన్‌కౌంటర్‌ చేశాక నయీమ్‌ గ్యాంగ్‌ అంతా బయటకు వస్తుందని, నయీమ్‌ దోచేసిన ఆస్తులను బయట పెడతారని అందరూ ఊహిస్తే నయీమ్‌ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదని ఆమె అన్నారు.

అలాగే సినీ రంగంలో డ్రగ్స్‌ కేసులో సినిమా రంగంలోని అనేక మందిని హడావిడి చేసి పిలిపించి విచారించారని…. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదన్నారు.

అలాగే మియాపూర్‌ భూముల విషయంలోనూ హడావిడి చేసి నలుగురి దగ్గర భూములు వెనక్కి తీసుకుని మిగిలిన వారిని ఎందుకు వదిలేశారో ఇప్పటికీ అర్థం కాదన్నారు ఆమె.

సినిమా హీరో నాగార్జున కొన్ని భూములను అక్రమంగా రెగ్యులరైజ్‌ చేసుకున్నారన్న ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు యాక్షన్‌ తీసుకోలేదో? చెప్పాలన్నారు విజయశాంతి.

హైదరాబాద్‌ శివార్లలో నాగార్జున కొన్ని ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని… మేము అధికారంలోకి వస్తే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్ హెచ్చరించాడు.

అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాడు గానీ…. ఆ ప్రభుత్వ భూములు నాగార్జున ఆధీనంలోనే ఉన్నాయి. మరి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని కేసీఆర్‌ను ప్రశ్నించింది విజయశాంతి.