తనపై భార్యకు ప్రేముందో లేదో తెలుసుకోవడానికి…. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు!

భార్యాభర్తల మధ్య అలకలు సాధారణం. నీకు నేనంటే ప్రేమ లేదు అని ఒకరిపై ఒకరు విసుర్లాడుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఏదైనా తెగే దాకా లాగితే మొదటికే మోసం వస్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండాలి కానీ నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అని పరీక్షించుకోకూడదు. అలా పరీక్షించి ఈ భర్త ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనాలోని జెన్‌జియాంగ్ ప్రావిన్సులోని జినువా అనే పట్టణంలో పాన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఒక రోజు ఇద్దరూ కలసి రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ పాన్ విపరీతంగా మద్యం సేవించాడు. అనంతరం ఇద్దరూ కలిసి రోడ్డుపై నడచుకుంటూ వస్తుండగా.. ఏదో విషయంలో మాటా మాటా పెరిగింది. నువ్వంటే నాకు ప్రేమలేదంటూ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నీకే గనుక నాపై ప్రేమ ఉంటే రక్షించు అంటూ ఆ రద్దిగా ఉండే రోడ్డు నడిమధ్యలో నిలబడ్డాడు. తొలుత రెండు మూడు సార్లు అతడిని రోడ్డు పక్కకు లాగింది. కానీ ఈ సారి మనోడు ఏకంగా రోడ్డు మధ్యలో అలాగే నిల్చుండి పోయాడు. భార్య కూడా తనే వస్తాడులే అని చూస్తూ ఉండగానే ఒక వ్యాన్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది.

దీంతో అతను అక్కడే గాయలతో పడిపోయాడు. వెంటనే భార్య అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. అతడి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రమాదమేమీ లేదన్నారు డాక్టర్లు. తలకు, ఛాతిమీద కొన్ని దెబ్బలు తగలడంతో చికిత్స చేసి పంపించారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి అతడిని విచారించగా అసలు విషయం తెలిపాడు. తన భార్యకు తనపై ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.