తమిళనాడులో దారుణం : తరగతి గదిలోనే టీచర్‌ను చంపిన కౄరుడు

తరగతి గదిలో ఒంటరిగా ఉన్న ఒక ఉపాధ్యాయరాలుపై ఒక కౄరుడు పాశవికంగా దాడి చేసిన సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. చెన్నైకు 200 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు..

కడలూరుకు చెందిన 23 ఏళ్ల ఎస్ రమ్య అనే యువతి స్థానిక గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూ‌లో ఐదవ తరగతి విద్యార్థులకు గణితం బోధిస్తుంటుంది. పాఠశాలకు సమీపంలోనే తన ఇల్లు ఉండటంతో అందరి కంటే ముందే రావడం తనకు అలవాటు. అదే విధంగా ఇవాళ కూడా ఉదయాన్నే పాఠశాలకు వచ్చి తరగతి గదిలో ఒంటరిగా కూర్చుంది.

దీన్ని గమనించిన రాజశేఖర్ అనే వ్యక్తి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరగడంతో రమ్యను రాజశేఖర్ కోపంతో అక్కడికక్కడే చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

తర్వాత పాఠశాలకు వచ్చిన సిబ్బంది జరిగిన ఘోరాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో రాజశేఖర్ ఆమె వెంట పడేవాడని.. అంతే కాకుండా ఆరు నెలల క్రితం రమ్య తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పెళ్లి ప్రస్తావన తీసుకొని రాగా వారు తిరస్కరించినట్లు సమాచారం.

దీన్ని మనసులో పెట్టుకునే ఇవాళ ఇంతటి ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కాగా, ఈ ఘటన జరిగిన తర్వాత పారిపోయిన రాజశేఖర్.. తన సోదరికి మొబైల్ కు సందేశం పంపాడు. తాను ఇక బతకనని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ సందేశంలో పేర్కొన్నాడు. పోలీసులు రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి.. రాజశేఖర్ కోసం గాలింపు చేపట్టారు.