దిగ్గజ దర్శకుడు కోడిరామకృష్ణ మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన చనిపోయారు.

తెలుగులోనే కాక తమిళం, మళయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. చిరంజీవి నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కోడి రామకృష్ణ ఆ తర్వాత దాదాపు 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే మంగమ్మగారి మనవడు, ఆహుతి, శత్రువు, అమ్మోరు, ముద్దుల మామయ్య, పెళ్లి, దేవీ పుత్రుడు, దేవుళ్లు వంటి చిత్రాలు వచ్చాయి. ఇక టాలీవుడ్‌లో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ తీసిన తొలి చిత్రాలు కోడి రామకృష్ణ దర్శకత్వంలోనివే.

అనుష్కను జేజెమ్మను చేసిన ‘అరుంధతి’ ఆయన దర్శకత్వపు ప్రతిభకు నిదర్శనం. తెలుగు చిత్ర పరిశ్రమకు అర్జున్, సుమన్, భానుచందర్ వంటి నటులను ఆయనే పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు వేశారు.

రఘుపతి వెంకయ్య పురస్కారం, 10 నంది, 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న కోడి రామకృష్ణ చివరిగా 2016లో ‘నాగహారపు’ అనే కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.