వలసలకు వారం రోజులు సెలవు

పాఠశాలలకు సెలవలుంటాయి. కళాశాలలకు సెలవలుంటాయి. ప్రభుత్వ కార్యలయాలకు, ప్రైవేటు ఆఫీసులకు కూడా సెలవలుంటాయి. రాజకీయ వలసలకు మాత్రం తొలిసారిగా సెలవలు వచ్చాయి.

ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మరో పార్టీలో చేరేందుకు మంచి ముహూర్తం నిర్ణయించుకుంటాడు. అది ఆదివారం కావచ్చు మరో రోజు కావచ్చు. ఇది చాలకాలంగా జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ రాజకీయ వలసలకు వారం రోజులు విరామం వచ్చింది.

వలసలకు విరామం ఏమిటనుకుంటున్నారా.. గడచిన వారం రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు అలాగే ఇతర పార్టీలకి చెందిన నాయకులు కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి చేరికల వార్తలు లేకుండా తెలుగు మీడియా కనపడలేదు.

అయితే బుధవారం నుంచి వారం రోజుల పాటు ఈ చేరికలకు తాత్కాలిక విరామం పడుతోంది. దానికి కారణం ఏమిటనుకుంటున్నారా? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ లండన్ వెళ్లారు. అక్కడ ఆయన వారం రోజుల పాటు ఉంటారు. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తేను కలుసుకునేందుకు తన భార్య భారతితో సహా లండన్‌కు పయనమయ్యారు.

ఆంధ్ర్రప్రదేశ్‌ రాజకీయాలలో వలసల పర్వానికి తాత్కాలికంగా తెర పడడానికి కారణం ఇదే. జగన్ లండన్‌లో వారం రోజులు ఉంటారు. ఈ వారం రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నుంచి కాని, ఇతర పార్టీల నుంచి కాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారు తమ చేరికను వాయిదావేసుకున్నారు. అయితే వారంతా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో టచ్‌లోనే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ నుంచి మరో 10 నుంచి 15 మంది పెద్దనాయకులు వచ్చే నెల మొదటి వారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.