పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం… పోలీసుల దర్యాప్తు

అమెరికాలో ఒక ఘటన సంచలనం సృష్టించింది. పదేళ్లుగా కోమాలో ఉన్న ఒక మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఫినిక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక మహిళ దశాబ్ద కాలంగా  కోమాలో ఉన్నారు. గత డిసెంబర్‌ 29న ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించే క్షణం వరకు ఆమె గర్బవతి అన్న విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది కూడా గమనించకపోవడం విశేషం. కోమాలో ఉన్న మహిళ ఒక బిడ్డకు జన్మిస్తున్న విషయాన్ని నర్సు గమనించి వెంటనే వైద్యులకు తెలియజేశారు. జన్మించిన పాప ఆరోగ్యంగానే ఉంది.

అయితే దశాబ్ద కాలంగా కోమాలో ఉన్న మహిళ… బిడ్డకు ఎలా జన్మనిచ్చింది అన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆమెపై   సిబ్బందిలోనే ఎవరో లైంగిక దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మీడియాలో ఈ ఘటన బాగా ప్రచారం జరగడంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న మగ ఉద్యోగులపై డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నారు.

ఈఘటనపై ఫినిక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే చట్టాలను అనుసరించి ఆమె వివరాలను పూర్తిగా బయటకు వెళ్లడించబోమని అధికారులు చెప్పారు. కోమాతో నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ఈ తరహా పరిస్థితి ఎదురవడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ వ్యవహారంలో ఉన్న దోషులను పట్టుకుని తీరుతామని చెబుతున్నారు.