భూతాపంపై శిఖరాగ్ర చర్చలు నిష్ఫలం

శీతోష్ణ స్థితిలో మార్పునకు మానవ ప్రమేయం కారణం కాదని డోనాల్డ్ ట్రంప్ అన్న తర్వాత, బ్రెజిల్, భారత్ అన్య మనస్కంగా వ్యవహరించిన తర్వాత పోలెండ్ లోని కటోవిస్ లో శీతోష్ణ స్థితిపై జరిగిన శిఖరాగ్ర సమావేశంలో సహజంగానే ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

బహుళపక్ష చర్చలు విఫలం కావడంలో ఇది మరో ఉదాహరణ మాత్రమే. కానీ రెండు వారాలపాటు చర్చల తర్వాత 200 దేశాలు బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలను తగ్గించడానికి 133 పేజీల నిబంధనల మీద మాత్రం ఏకాభిప్రాయం కుదుర్చుకున్నాయి.

ఈ నిబంధనలు శీతోష్ణ స్థితిపై మార్పులపై 2015లో కుదిరిన పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి సంబంధించినవి. అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు డిగ్రీలకన్నా మించకూడదన్నది సంకల్పం.

ఈ నిబంధనలను కటోవిస్ శీతోష్ణ స్థితి మార్పు ఒప్పందం అంటున్నారు. వివిధ దేశాలు భూతాప ఉద్గారాలను పరిశీలించి తెలియజేయడం, వీటిని తగ్గించడానికి చర్య తీసుకోవడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం.

అయితే ఈ నిబంధనలను అమలు చేసే యంత్రాంగం ఏదీ లేదని నిరాశావాదులు వాదించవచ్చు. భూతాప ఉద్గారాలను తగ్గించకపోతే ఏమవుతుంది? దీనికి భిన్నంగా ఇంధన సామర్థ్యం పెరగడం, శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడం జరగకపోలేదు. శీతోష్ణ స్థితిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోకుండా అంతర్జాతీయంగా స్థూల జాతీయోత్పత్తిని పెంచడానికి వాడే ఇంధనం 1990 నుంచి 32 శాతం తగ్గింది.

అభివృద్ధి చెందిన దేశాలలోకన్నా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తగ్గుదల ఎక్కువగా ఉంది. దీన్నిబట్టి మార్పు సాధ్యమే కాని అది సాంకేతికతవల్ల మాత్రమే సాధ్యం కాదని, వివిధ దేశాల మధ్య సమానత్వం ఉండేలా చూసే యంత్రాంగం లేకపోవడమే అసలు సమస్య. ఇది రాజకీయమే.

ఈ సమానతను పరిశీలించడానికి ఉదాహరణకు భూతాపాన్ని పెంచే వాయువులను రెండు డిగ్రీలకన్నా ఎక్కువగా పెరగకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకున్నామనుకోండి. దీన్ని ప్రస్తుత ప్రపంచ జనాభాతో భాగించి చూద్దాం. దాన్ని బట్టి ఏ దేశం భూతాపానికి కారణమయ్యే ఉద్గారాలను ఏ మేరకు తగ్గించాలో తేలుతుంది.

సంపన్న దేశాల్లో పారిశ్రామికీకరణ ఎక్కువ కనక ఆ దేశాలు వెదజల్లే ఉద్గారాలే ఎక్కువ. వీటిని తగ్గించాలంటే ఆ దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కోత పెట్టాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఇలా ఉత్పత్తి అయ్యే వస్తువుల వాణిజ్యానికి అవకాశం కల్పిస్తే సంపద సంపన్న దేశాల నుంచి పేద దేశాలకు బదిలీ అవుతుంది. అంటే ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

అలా కాకుండా కొత్తగా వెలువడే ఉద్గారాల లెక్కను బట్టి దాన్ని జనాభాతో భాగించాం అనుకోండి. అప్పుడు పేద దేశాల్లో ఇంధన వాడకం బాగా తగ్గిపోతుంది. ఈ దేశాల్లో జనాభా మాత్రం పెరుగుతూ ఉంటుంది. సంపన్న దేశాలలో జనాభా తగ్గిపోతూ ఉంటుంది. సమర్ధమైన ఇంధనాల అభివృద్ధికి పెట్టుబడులు పెరుగుతాయి.

అంటే ఉద్గారాలను తగ్గించే క్రమంలో అసమానతలు మరింత పెరుగుతాయి. కటోవిస్ ఒప్పందం దీనికి దగ్గరగానే ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఉద్గారాలను తగ్గించడానికి కొత్త లక్ష్యాలు నిర్దేశించారు. శీతోష్ణ స్థితిలో మార్పులను ఎదుర్కునే మిషతో అసమానతలను పెంచి పోషించినట్టు అవుతుంది.

సమానత్వ సమస్యను పరిష్కరించడానికి కటోవిస్ లో మూడు రకాల ప్రయత్నాలు జరిగాయి.

మొదటిది-ఉద్గారాలను తగ్గించడానికి వర్ధమాన దేశాలకు నిర్దేశించిన లక్ష్యాలు సంపన్న దేశాలకు నిర్ధారించిన లక్ష్యాలకన్నా ఎక్కువ కాలం అమలులో ఉండేవి. దీని ద్వారా సంపన్న దేశాలు, వర్ధమాన దేశాలు అన్న విభజన రేఖ అలాగే కొనసాగుతూ ఉంటుంది. తమ దేశాన్ని వర్ధమాన దేశంగా పునర్నిర్వచించాలని టర్కీ కటోవిస్ లో వాదించింది.

రెండవది-ఉద్గార లక్ష్యాలను మార్చాలనుకోవడం. దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలను పెంచే అవకాశం వస్తుంది.

మూడవది-కటోవిస్ శిఖరాగ్ర సభ “శీతోష్ణ స్థితి” సమస్యను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయపడడానికి ఏటా 100 బిలియన్ డాలర్లు కేటాయించాలని ప్రతిపాదించింది.

దురదృష్టవశాత్తు ఇవి అభివృద్ధి చెందిన దేశాలకు తాయిలాలు మాత్రమే. గత సంవత్సరం అట్లాంటిక్ భీకర తుపాను వల్లే 100 బిలియన్ డాలర్ల మేర నష్టం కలిగింది. కార్బన్ వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేయనే లేదు. దీనివల్ల మేలు కలిగింది సంపన్న దేశాలకే కానీ పేద దేశాలకు కాదు. సంపన్న దేశాలు భూతాపానికి దోహదం చేసే ఉద్గారాలను పెంచి సంపన్నమైనాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాలను మాత్రం వీటిని తగ్గించాలంటున్నాయి.

అంతర్జాతీయంగా ఇంధన సామర్థ్యం పెరగడంవల్ల మరో చిత్రమైన పరిణామం కనిపిస్తోంది. చాలా దేశాలు “కాలుష్య కారకులే దాని ఫలితాలు భరించాలి” అన్న ఉద్దేశంతో కార్బన్ పన్నులు విధించాయి. అసలు సమస్య ఈ ఉద్గారాల ప్రభావం ఇతర దేశాల మీద పడడం.

జాతీయ పన్నుల ద్వారా సమకూరే ఆదాయం ఇతర దేశాలకు అందదు. ఉద్గారాల ప్రభావం లోతట్టున ఉండే దేశాలపై, దీవులపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్రాలు వేడెక్కడంవల్ల కలిగే ప్రభావం ఈ ప్రాంతాల మీదే ఉంటుంది. అక్కడ ప్రచండమైన తుపాన్లు, సముద్రమట్టం పెరగడంవంటి సమస్యలు వస్తాయి. శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల సమస్య ఎదుర్కుంటున్నది ప్రధానంగా ఈ ప్రాంతాల వారే. ఈ సమస్య మీద కటోవిస్ లో అసలు దృష్టే పెట్టలేదు.

ఇతరుల చర్యలవల్ల శీతోష్ణ స్థితిపై పడే దుష్ప్రభావాన్ని ఎదుర్కోవడానికి జాతీయ ఉద్గార పన్నులపై 20 శాతం అంతర్జాతీయ సర్చార్జీ విధించాలి కాబోలు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)