మరో ప్రేమికుడు బలి…. మద్యం తాగించి చంపేశారు….

కులాంతర వివాహం మరో యువకుడి ప్రాణం తీసింది. అమ్మాయి తరపు బంధువులు అతడిని చంపేశారు. హైదరాబాద్ తిరుమలగిరిలో ఈ ఘటన జరిగింది.

అల్వాల్‌కు చెందిన నందకిషోర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అశ్విని అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.

మూడేళ్ల క్రితం నందకిషోర్, అశ్వినిలు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. పెళ్లి అయిపోయినప్పటికీ నందకిషోర్‌ను వదిలేసి రావాల్సిందిగా అమ్మాయి తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. మరో పెళ్లి చేస్తామని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు.

తొలుత ఇందుకు అశ్విని అంగీకరించలేదు. అయితే ఇటీవల నందకిషోర్, అశ్వినిల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. నందకిషోర్ వేధిస్తున్నాడంటూ అశ్వినీ ఇటీవల తన కుమారుడుతో కలిసి పుట్టింటికి వచ్చేసింది.

ఈనేపథ్యంలో మాట్లాడుకుందాం రమ్మంటూ నందకిషోర్‌ను అశ్విని బంధువులు పిలిపించారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే బాగా మద్యం తాగించారు.

అనంతరం మాటమాట పెరిగింది. దాంతో అశ్విని బంధువులు బండరాళ్లతో మోది నందకిషోర్‌ను దారుణంగా చంపేశారు.  తన కుమారుడిని అశ్విని సోదరుడు మహేష్‌, అతడి బంధువులే హత్య చేశారని మృతుడి తల్లి ఆరోపించారు.