మధ్యతరగతికి ఏం చేశావ్? నిలదీసిన బీజేపీ కార్యకర్తలు…. నీళ్లు నమిలిన మోడీ

ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉండడంతో బీజేపీ మేడిపండు విచ్చుకుంటోంది. అసంతృప్తితో రగిలిపోతున కార్యకర్తలు, నేతలు మోడీపై తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. ఇన్నాళ్ళూ అధికారంలో ఉండడంతో కిక్కురుమనకుండా ఉన్న బీజేపీ కింది బూతు స్థాయి నేతలు.. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తుండడంతో ప్రధాని మోడీకి జ్ఞానోదయం చేసే పనిలో బిజీగా ఉన్నారు.

తాజాగా బుధవారం ఉదయం ప్రధాని మోడీ.. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో లైవ్ షో లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు బూత్ స్థాయి కార్యకర్తలు.. ఈ నాలుగేళ్లలో మధ్య తరగతికి ఏం చేశారంటూ నిలదీశారు. మధ్యతరగతి కోసం ప్రవేశపెట్టిన ఒక్క పథకం చెప్పాలని మోడీని నిలదీశారు. దీంతో నీళ్లు నమిలిన మోడీ సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు.

ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోడీపై సెటైర్ వేశారు. సొంత కార్యకర్తలకే సమాధానం చెప్పలేని మోడీ.. దేశ ప్రజలకు ఏం చెప్తారని సెటైర్ వేశారు. ఈ పరిణామం ఎన్నికల ముందర దేశంలో బీజేపీపై ఉన్న అసమ్మతిని, అసంతృప్తిని తెలియజేస్తుందని రాహుల్ పేర్కొన్నారు.

ఈ పరిణామాలన్ని చూశాక… బీజేపీలోనే అసంతృప్తి ఈస్థాయిలో ఉంటే…. ఇక ప్రజల్లో బీజేపీ పట్ల ఏమేరకు అసంతృప్తి ఉందో అర్థమవుతోంది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయమనే చర్చ సాగుతోంది.