ఆర్థికంగా కుంగ దీస్తున్న కాలుష్యం

లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ సంస్థ వెలువరించిన పరిశోధనా ఫలితాల ప్రకారం మన దేశంలో కలుషితమైన గాలి పీల్చి జబ్బు పడే వారు, మరణించేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. లాన్సెట్ పరిశోధనా ఫలితాలు మన దేశానికి సంబంధించినంత మేరకు ప్రమాద సూచికలుగా ఉన్నాయి. ఆరోగ్య సంక్షోభం తాండవిచే దశలో ఉన్నాం. కలుషితమైన గాలి నుంచి జనాన్ని రక్షించడానికి తక్షణం చర్య తీసుకోవలసిన అవసరం ఉంది.

మన దేశంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. అయితే కలుషితమైన గాలి పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు, జీవన ప్రమాణాలకు ముప్పు ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించడం లేదు.

వివిధ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు దేశమంతటా సర్వే చేసి ఈ ఫలితాలు వెల్లడించారు. మన చుట్టూ ఉన్న ధూళి కణాలు, ఇళ్లల్లో పీల్చే గాలిలో ఉన్న కాలుష్యంపై వివిధ రాష్ట్రాలలో 2017లో ఈ పరిశోధన కొనసాగింది. మరణాలు, రోగాల బాధ, జీవన ప్రమాణాలు అన్న మూడు వర్గాల కింద కాలుష్య బాధ చూపించారు.

మన దేశంలో పీల్చే గాలిలో ధూళి కణాలు అంటే పి.ఎం.2 2017లో 89.9 యు.జి/ఎం3 ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ఇది చాలా ఎక్కువ. వాతావరణంలోని గాలిలో ధూళి కణాలు 10 యు.జి/ఎం3 కన్నా ఎక్కువగా ఉండకూడదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలను మన దేశంలో ఏ రాష్ట్రమూ పట్టించుకోవడం లేదు. పైగా జనాభాలోని 77 శాతం జనాభా పీల్చే గాలిలో ధూళి కణాలు 40 యు.జి/ఎం3 కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిణామం నేషనల్ ఆంబియెంట్ ఏర్ క్వాలిటీ స్టాండర్డ్స్ సిఫార్సు చేసింది.

మన దేశంలో గాలి కాలుష్యంవల్ల సోకే జబ్బులు పొగాకు వాడడంవల్ల వచ్చే రోగాలకన్నా ఎక్కువ. దీనివల్ల శ్వాస కోశ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. 2017లో 10 లక్షల 24 వేల మంది వాయు కాలుష్యంవల్ల మరణించారు. వీరిలో 51.4శాతం మంది 70 ఏళ్లకు పై బడినవారే.

వాయు కాలుష్యం కనీస స్థాయికన్నా తక్కువగా ఉండి ఉంటే జీవన ప్రమాణం 1.7 సంవత్సరాలు పెరిగేది. గాలిలో ధూళి కణాలు, ఇంట్లో పీల్చే గాలిలో కాలుష్య స్థాయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. అందువల్ల దాని దుష్ప్రభావంలో కూడా తేడాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్, హర్యానా, దిల్లీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో గాలిలో ధూళి కణాలు ఎక్కువ. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సాంలో ఇళ్లల్లో పీల్చే గాలిలో కాలుష్యం అధికంగా ఉంది. అంటే వాయు కాలుష్యం నగరాలకు, పట్టణాలకే పరిమితమైంది కాదు. గ్రామీణ ప్రాంతాలలోనూ ఈ బెడద ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వంట చేసుకోవడానికి పిడకలు, బొగ్గులు, వంట చెరకు వాడడంవల్ల కాలుష్యం పెరుగుతోంది. 

ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ పరిశ్రమలు, వాహనాలు వెదజల్లే కాలుష్యం, పంటల నూర్పిళ్ల తర్వాత ఆ అవశేషాలను దగ్ధం చేయడం, భవన నిర్మాణాల వల్ల కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దిల్లీలో విషపూరితమైన పొగమంచు బెడద శీతాకాలంలో మరీ ఎక్కువ అవుతున్నందువల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పలేదు.

కాలుష్యం వల్ల ఆర్థిక భారం ఎక్కువ పడుతుందని గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేం. కాలుష్యంవల్ల ఆనారోగ్యం బారిన పడినప్పుడు కూడా ఆర్థిక భారం పడుతుంది. వాయు కాలుష్యంవల్ల భారత్ లో సంక్షేమానికి 505.1 బిలియన్ డాలర్ల మేర నష్టం కలిగిందని ప్రపంచ బ్యాంకు, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 2013నాటి కొనుగోలు శక్తి ఆధారంగా ఈ అంచనా వేశారు. కాలుష్యంవల్ల 2013లో పని దినాలు కోల్పోవడంవల్ల కలిగిన నష్టం 55.39 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2011నాటి కొనుగోలు శక్తి ఆధారంగా వేసిన అంచనా. సంక్షేమం, పని దినాల నష్టంవల్ల 2013లో స్థూల జాతీయ ఉత్పత్తిలో కలిగిన నష్టం 8.5 శాతం ఉంది. అంటే ఆర్థికాభివృద్ధికి విపరీతమైన నష్టం కలుగుతోంది.

వాయు కాలుష్య ప్రభావం పెరుగుతూ ఉన్నందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని గుర్తించక తప్పలేదు. వాయు కాలుష్యం దేశమంతటా ఉన్న సమస్య. అందుకే వాయు కాలుష్యాన్ని అంచనా వేయడానికి జాతీయ పరిశుభ్ర వాయువు పథకం ప్రారంభించవలసి వచ్చింది.

అయితే ఇందులో కాలుష్యాన్ని తగ్గించడానికి నిర్దిష్టమైన చర్యలు లేనందువల్ల పర్యావరణ శాస్త్రవేత్తలు విమర్శలు గుప్పించారు. 2017 డిసెంబర్ నాటికి కాలుష్య నివారణ చర్యలకు కట్టుబడి ఉండాల్సి ఉన్నా ప్రభుత్వం కాలుష్యం వెదజల్లే బొగ్గు ఆధారిత విద్యుత్ పథకాలకు అనుమతులు ఇస్తూనే ఉంది. ఈ మినహాయింపులు ఇవ్వడంవల్ల అంతకంతకూ పెరుగుతున్న కాలుష్య నివారణకు ప్రభుత్వం ఏ మేరకు నిబద్ధమై ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాలుష్యాన్ని నివారించాలంటే ప్రాంతీయ సమన్వయం మాత్రమే కాకుండా, రాజకీయ సంకల్పం, ప్రజా సంకల్పం కూడా అవసరం.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)