తెలంగాణ కొత్త హోంమంత్రిని ప్రకటించిన కేసీఆర్‌

తెలంగాణ కొత్త హోంమంత్రిగా మహమూద్‌ అలీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. గత కేసీఆర్‌ ప్రభుత్వంలో అలీ డిప్యూటీ సీఎంగా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు.

గురువారం కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. అలీకి హోంశాఖ మంత్రిగా బాధ్యతలను సీఎం అప్పగించారని సీఎంవో ప్రకటన విడుదల చేసింది.

గత కేసీఆర్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పనిచేశారు. హోంమంత్రిగా మహమూద్‌ అలీని నియమించడం ద్వారా ఈసారి కూడా మైనార్టీలకు తాను ఇస్తున్న ప్రాధాన్యతను కేసీఆర్‌ చాటే ప్రయత్నం చేశారు.

ఎమ్మెల్సీగా ఉంటూ మొన్నటి వరకు హోంశాఖ బాధ్యతలు నిర్వహించిన నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్ ఈసారి మంత్రి వర్గంలో అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి.