టీఆర్ఎస్ గెలుపుపై ఏపీలో సంబరాలు..!

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి అత్యధిక స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో తెలంగాణ జిల్లాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు.

తెలంగాణలోనే కాదు…పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు పండగ చేసుకుంటుంటే….ఏపీలో బాణాసంచా పేల్చి టీఆర్ఎస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు.

కొందరు కార్యకర్తలు కాస్త ముందున్నారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ… టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి తమ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు కేసీఆర్ అభిమానులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. కేసీఆర్ తనను నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం వల్లే….ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని కేసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు షేక్ ఖాదిర్ అన్నారు. కేసీఆర్ ను ప్రసంశసలతో ముంచెత్తారు.