హత్య కేసులో ”కోడలా కోడలా కొడుకు పెళ్లామా” నటి

వజ్రాల వ్యాపారి హత్య కేసులో ప్రముఖ సీరియల్ నటి దెవోలినా భట్టాచార్య చిక్కుకున్నారు. తెలుగులో ప్రసారం అవుతున్న కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియల్‌లో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న దెవోలినా… ముంబైకి చెందిన ఒక వజ్రాల వ్యాపారి హత్య కేసులో పోలీసులు విచారించారు.

వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడాని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఉడాని వారం రోజులైనా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రాయ్‌గడ్‌ జిల్లాలోని అడవుల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉడాలి మృతదేహం లభించింది. కేసులో తొలుత సచిన్ పవార్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో దెవోలినా భట్టాచార్యకు ఉడానితో ఉన్న లింకులు బయటపడ్డాయి.

ఆమెను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. మృతుడు ఉడాని కాల్‌డేటాను బయటకు తీసిన పోలీసులు.. చనిపోవడానికి ముందు ఆయనకు వచ్చిన ఫోల్‌ కాల్స్‌పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే దెవోలినాను స్టేషన్‌కు పిలిపించినట్టు భావిస్తున్నారు.

సచిన్‌ పవార్‌ ద్వారా పలువురు మహిళలతో మృతుడు రాజేశ్వర్‌ ఉడానికి పరిచయం ఏర్పడింది. సినీ ఇండస్ట్రీ, బార్‌ డాన్సర్లతో అతడు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాడని కాల్‌డేటా ఆధారంగా బయటపడింది. ఈకేసులో మరికొందరు సినీ నటీమణులను కూడా విచారించే అవకాశం ఉంది.