వాల్మీకి

	నేస్తాలూ!

	'రామాయణం'తెలిసిన మీకు ఆ కావ్యం రాసిన వాల్మీకి కూడా తెలియకుండాపోరు.మరి అలాంటి వాల్మీకి గురించి తెలుసుకుందామా? 

	వాల్మీకిని బోయవానిగా మీరెరిగిందే. అయితే వాల్మీకి బ్రహ్మపుత్రుడని, సత్యయుగంలో బ్రహ్మ ఆగ్రహానికిలోనై శాపగ్రస్తుడయినాడట. 'నీవు పతితుడవై, క్రూర కర్మలు చేయుచూ బోయలతో కలిసిపొమ్మ'ని బ్రహ్మ శపించినట్లుగా చెబుతారు. దాంతో శూద్రులతో కలిసి తిరుగుతూ ఒక బోయ యువతిని పెండ్లాడాడట. అడవిలోనే ఉంటూ ఆ దారి వెంట పోయే వారిని దోచుకునే వాడట. 

	ఒక రోజు సప్త ఋషులు వస్తే వారిని దోచుకునేందుకు ప్రయత్నించి కమండలం లాక్కున్నాడట బోయ వాల్మీకి. అప్పుడు మునులు 'నీ కుటుంబ పోషణకై నీవు ఇంత పాపము మూటగట్టుకుంటున్నావు. మరి నీవు సంపాదించిన ధనంతోపాటు పాపమూ పంచుకుంటారేమో అడిగిరా, నువ్వు తిరిగి వచ్చే వరకు మేం ఇక్కడే ఉంటాం' అన్నారట. 

	'మమ్మల్ని పోషించడం నీ విధి, నీవు ఆర్జించిన పాప పుణ్యాలతో మాకు సంబంధం లేదు' అన్న భార్య మాటలు విని వాల్మీకి విరక్తితో వచ్చి ఆ మునులనే తరుణోపాయము అడిగాడు. రామ నామమును ఉపదేశించినారట మునులు. ఆ పలుకు పలకడం కూడా కష్టమైనదట. 'మరా మరా' పలుకుల ప్రవాహంలో 'రామ' నామమే జనించి ధ్వనించినదట. 

	అలా వాల్మీకి తమసా నదీ తీరమున ఘోరమైన తపస్సు చేశాడట. అప్సరసలైన రంభ, ఊర్వశిలను ఇంద్రుడు పంపించి తపోభంగం చేయప్రయత్నించినా ఫలితం లేకపోయిందట. వాల్మీకి తపస్సులో ఉండగా అతని శరీరంపై పుట్టలు లేచాయట. చెట్లు మొలిచాయట. 

	ఇదిలా ఉండగా విష్ణుమూర్తి రామునిగా అవతారమెత్తుతారని నారదుడు విన్నాడట. విన్న విషయం ఎవరికీ చెప్పవద్దని నారాయణుని ఆజ్ఞను మీరలేక చెట్టుకూ చేమలకూ చెప్పుకున్నాడట నారదుడు. అలా చెట్టూ పుట్టకు చెప్పిన కథను వాల్మీకి విన్నాడట. 

	ఆ తర్వాత బ్రహ్మయే వచ్చి 'రామాయణము రచింపుము' అని వాల్మీకితో చెప్పాడనీ అంటారు. 

	అడవిలోని సీతమ్మను ఆదరించడంలోగానీ, కుశలవలకు నామకరణము చేసి విద్యాబుద్ధులు చెప్పడంలోనూ వాల్మీకి పాత్ర ఉంది. వాల్మీకి రామ కథ రాస్తూ మరో వంక కథలో తనూ ఉండటం ఆసక్తిని గొలుపుతుంది. లవకుశలచే రామాయణ గాధ పాడించిందీ వాల్మీకేనని చెబుతారు. 

	'వల్మీకం' అంటే తెలుసుగా? 'చీమల పుట్ట'. వల్మీకం నుంచి పునర్జన్మ పొందిన వాడు కావడం వల్ల 'వాల్మీకి' అయినాడు!. 'గజదొంగ'గా జీవితమొకటయితే మహా ఋషిగా 'మహర్షిగా' దిద్దుకున్న జీవితం మరొకటి! ఆది కావ్యంగా రమణీయ కథా కావ్యంగా 'రామాయణం' చిరస్మరణీయం. అలాంటి రామాయణానికి ఇంటి పేరు వాల్మీకి! 

- బమ్మిడి జగదీశ్వరరావు