ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఓడించాలని చంద్రబాబు పిలుపు

తెలంగాణలో మహాకూటమిని గెలిపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు… తన వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి తాను బీజం వేస్తే ఆ తర్వాత కాంగ్రెస్ ఆ అభివృద్ధిని కొనసాగించిందని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ మాత్రం హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా… మెట్రో రైలును అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.

గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే… వారు తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయి ద్రోహం చేశారని చంద్రబాబు విమర్శించారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

మోడీ, అమిత్ షా జోడి చాలా ప్రమాదకరంగా తయారైందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల ద్వారా దాడులు చేయిస్తూ తనను భయపెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.