తప్పు జరిగి ఉంటే ట్వీట్‌ తీసేయాలిగా సుజనా…!

టీడీపీ ఎంపీ సుజనాచౌదరి బ్యాంకులను ఆరువేల కోట్లకు ముంచారని ఈడీ అధికారికంగా ప్రకటించినా సరే సుజనా చౌదరి బుకాయింపు మాత్రం ఆగలేదు.

తనపై దాడులు చేయడం పొరపాటు అని ఈడీ అధికారులే ఒప్పుకున్నారని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. సరైన విచారణ చేయకుండా ఈడీ తొందరపడి ఆరోపణలు చేసిందని…. ఇప్పటికే తాను ఈడీ అధికారులతో మాట్లాడానని…. వారు కూడా పొరపాటు జరిగిపోయిందని అంగీకరించారని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.

తన కంపెనీలు తప్పు చేయవని చెప్పారు. సుజనాచౌదరి ఇచ్చిన వివరణ మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. సుజనా వివరణ కేవలం బుకాయింపు తరహాలోనే ఉందనిపిస్తుంది. ఎందుకంటే దాడులపై ఈడీ అధికారులతో మాట్లాడానని… వారు కూడా పొరపాటు అయిపోయిందని ఒప్పుకున్నారని సుజనాచౌదరి చెబుతున్నారు.

ఒకవేళ అదే నిజమైతే ఈడీ తప్పు సరిదిద్దుకునేది కదా!. కానీ సుజనాచౌదరి ఆరు వేల కోట్ల మేర బ్యాంకులకు మోసం చేశారంటూ ఈడీ అధికారికంగా చేసిన ట్వీట్‌ ఇప్పటికే అలాగే ఉంది.

ఒకవేళ సుజనాచౌదరి ముందు తమది తప్పు అని ఈడీ అధికారులు ఒప్పుకునే ఉంటే సదరు ట్వీట్‌ను తీసేసేవారు కదా!. కాబట్టి సుజనాచౌదరి బుకాయింపు కోసమే తాము తప్పు చేసినట్టు ఈడీ అధికారులే ఒప్పుకున్నారని చెబుతున్నట్టుగా ఉందని అర్థమవుతోంది.

బహుశా సుజనాచౌదరి మాట్లాడింది… ఈడీలో చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించిన ఆ ఇద్దరు అధికారులతో కాబోలు అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరు టీడీపీ సీనియర్‌ నేత మేనల్లుడే.