నాగచైతన్య చాలా ఫాస్ట్ గా ఉన్నాడు

ఓవైపు థియేటర్లలో సవ్యసాచి సినిమా నడుస్తోంది. మొన్నటివరకు ఈ సినిమా ప్రమోషన్ లోనే నాగచైతన్య బిజీగా ఉన్నాడు. ఇంతలోనే ఈ హీరో మరో సినిమా స్టార్ట్ చేయడం, దాన్ని అప్పుడే ఓ కొలిక్కి తీసుకురావడం చకచకా జరిగిపోయాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి భార్య సమంత ఇందులో చైతూ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లిద్దరి కాంబోలో ఇది నాలుగో సినిమా. ఈ షూటింగ్ అప్పుడే 40 శాతం పూర్తయింది. రీసెంట్ గా విశాఖలో జరిగిన షెడ్యూల్ తో సినిమా 40శాతం కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈనెల 26 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. డిసెంబర్ చివరి నాటికి టోటల్ షూటింగ్ పూర్తిచేసి, ఫిబ్రవరిలో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. పెళ్లయిన తర్వాత చైతూ-సమంత కలిసి నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో బిజినెస్ బాగా జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.