జనసేనలో ఏం జరుగుతోంది? దందాలు మొదలయ్యాయా?

‘ఎవరైనా టికెట్లను ఇప్పిస్తామని అంటే వారిని నమ్మవద్దు…. ’ అని ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒక రాజకీయ పార్టీ అధినేత ఇలా ప్రకటన చేశాడంటే.. ఆ పార్టీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనసేనకు అంటూ ఇప్పటి వరకూ సరైన నిర్మాణం లేదు. అయినా పవన్ కల్యాణ్ ఇలా ప్రకటించుకోవాల్సి వస్తోంది. ఎవరైనా టికెట్లు ఇప్పిస్తామని అంటే వారిని నమ్మవద్దని పీకే చెబుతున్నాడంటే.. ఇప్పటికే పవన్ పార్టీలోకి చేరి పోయిన వారు దందా మొదలుపెట్టారని స్పష్టం అవుతున్నట్టే.

పవన్ కల్యాణ్ పార్టీలో ఇప్పటి వరకూ చేరింది కొంతమందే. వాళ్లే అంతర్గత పోరు మొదలుపెట్టారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అవి పతాక స్థాయికి చేరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ టికెట్ల విషయంలో పవన్ చేసిన ప్రకటన ఒకింత ఆసక్తిదాయకమే. ఇప్పటికే చేరిన వారు టికెట్లను ఇప్పిస్తామంటూ ఏదైనా దందా మొదలుపెట్టి ఉండవచ్చని.. అందుకే పవన్ కల్యాణ్ ఇలా ప్రకటన చేశాడని స్పష్టం అవుతోంది. ఇంకా తాడూ బొంగరం లేని జనసేనలో అప్పుడే ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే అంతే సంగతి.

ఇక ఆ సంగతలా ఉంటే.. పవన్ కల్యాణ్ చాన్నాళ్లుగా మూడు నాలుగు జిల్లాల మీదే పని చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మాత్రమే పవన్ కల్యాణ్ తచ్ఛాడుతున్నాడు. అక్కడే జనసేన పార్టీకి కాస్తో కూస్తో సీట్లు వస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ జనసేనకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా ఊపు రాకపోవడం గమనార్హం.

ఏదో కొద్దిమంది పవన్ కల్యాణ్ సినీ అభిమానులు మాత్రమే హడావుడి చేస్తున్నారు. వారి వల్ల ప్రయోజనం లేనట్టే. ఆ కొన్ని ఓట్లతో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు. ఇక జనసేనకు ఓటేసినా ప్రయోజనం లేదనే అభిప్రాయాలు కాపు సామాజికవర్గంలో కూడా వినిపిస్తున్నాయి. ఎలాగూ గెలవలేరని తెలిశాక.. ఓటెందుకు వేయాలి అనేది వారు వేస్తున్న ప్రశ్న.