యాక్షన్ అదిరింది.. టీజర్ పోయింది

బాలీవుడ్ విలక్షణ నటి కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం మణికర్నిక. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండడమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేశారు. టీజర్ లో కంగనా యాక్టింగ్ చాలా బాగుంది. కానీ నిర్మాణ విలువలు మాత్రం నాసిరకంగా ఉన్నాయంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

జీ స్టుడియోస్ బ్యానర్ తో కలిసి కమల్ జైన్ నిర్మించిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మరీ నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రాండ్ గా తీయాల్సిన విజువల్స్ ను పేలవంగా తెరకెక్కించారని, గ్రాఫిక్స్ లో కూడా నాణ్యత లోపించిందని అంటున్నారు. బాహుబలి లాంటి భారీ చిత్రంతో పాటు ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభవం ఉన్న బాలీవుడ్ ప్రేక్షకులకు మణికర్నికలో విజువల్ ఎఫెక్టులు అంతగా నచ్చినట్టు కనిపించలేదు.

టీజర్ లోనే నిర్మాణ విలువలు ఇలా ఉంటే, సినిమా మొత్తంలో ఇంకెంత దారుణంగా ఉంటాయనేది అందరి డౌట్. శంకర్-ఎహశాన్-లాయ్ సంగీతం అందించిన ఈ సినిమాను జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేయబోతున్నారు.