బలి

ప్రహ్లాదుడు తెలుసుకదా? అతని నలుగురు కొడుకుల్లో ఒకడైన విరోచనుని కొడుకే బలి. ఆడిన మాట తప్పనివాడు. ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడు. అందువల్ల తన ఉనికికే ప్రమాదం వచ్చినాసరే శిరసొంచనివాడు. అంతే ధర్మబద్దుడు. వీరుడు. ధీరుడు. బలి చక్రవర్తిగా బహుళ ప్రాచుర్యం పొందినవాడు.

బలిచక్రవర్తి భార్య ఆశన. కూతురు రత్నమాల. కొడుకులు బాణుడు, ధృతరాష్ట్రుడు, నికుంభనాధుడు, విభీషణుడు.

రాక్షసజాతికీ దేవజాతికీ వైరం తెలిసిందే. రాక్షసుల కార్యాలను అడ్డగించడం, బాధలు పెట్టి తమది పైచేయిగా ఉండాలని దేవతలు ప్రయత్నించడం బలి దృష్టికి వచ్చింది. దాంతో బలి ఇంద్రనగరం మీద దండెత్తాడు. ఇంద్రున్ని పదవి నుంచి పడగొట్టాలనుకున్నాడు. యుద్ధంలో ఓడిపోతానని భయపడి ఇంద్రుడు పారిపోయాడు. పోయి తమ గురువైన బృహస్పతిని కలిసాడు. దారి చూపించమన్నాడు. బలిచక్రవర్తిని గెలవడం నీ వశం కాదన్నాడు బృహస్పతి. రాజ్యం విడిచిపెట్టక తప్పదన్నాడు. విష్ణుమూర్తి సహాయంతో రాజ్యాన్ని తిరిగి పొందగలవన్నాడు. ఇంద్రుడు రాజ్యాన్ని వదిలాడు.

మూడులోకాలకు బలియే చక్రవర్తి అయ్యాడు. అయితే తమ జాతి జనుల్లో ధైర్యమూ తేజమూ తగ్గడము గమనించాడు. దేవతలు ఏక్షణమైనా విరుచుకు పడతారన్న భయంవల్లేమో అనుకున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇదంతా ఆ హరి ప్రభావమేనని చెప్పాడు. “ఎవడా హరి? అతన్ని జయించలేమా? దేవజాతినే ఓడించాం, ఇంక ఈ హరి యెంత?” అని బలిచక్రవర్తి గర్వంతో అన్నాడు. దాంతో కోపమొచ్చిన ప్రహ్లాదుడు “నువ్వా హరి వల్లే పదవీ భ్రష్టుడవవుతావని” శపించాడట!.

మరోవైపు బలి మూడులోకాలను తన అదుపులో పెట్టుకున్నాడని దేవతలు బ్రహ్మకు పిర్యాదు చేసారు. బ్రహ్మ విష్ణువు దృష్టికి తీసుకెళ్ళాడట. అప్పుడు విష్ణుమూర్తి విషయం గ్రహించి వామన రూపం ధరించాడు. బలి దగ్గరకు వచ్చాడు. చేతులు చాచి యాచించాడు. ఏం కావాలో కోరుకొమ్మన్నాడు బలి. వామనుని గ్రహించిన రాక్షస గురువు వద్దని వారించి హెచ్చరించాడు. బలి ఇచ్చిన మాట తప్పనన్నాడు. వామనుడు మూడడుగుల నేల ఇమ్మని అన్నాడు. బలి అనుమతిగా ధారపోసాడు. వామనుడు విజృంభించేలా పెరిగిపోయాడు. ఒక పాదాన్ని భూమి మొత్తం మోపాడు. మరొకపాదాన్ని ఆకాశమంతటా పెట్టాడు. మూడో అడుగు పెట్టడానికి చోటులేదంటూ బలి తలమీద కాలుపెట్టాడు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి బలి భక్తి కలవాడని, నీతి కలవాడని, అందువల్ల దండనకూడదని, మన్నింపుమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు బలిని పాతాళ లోకంలో పడేసాడట హరి!

పాతాళలోకంలో బందీగా ఉన్న బలి చక్రవర్తి దగ్గరకు రావణుడు రాజ్యకాంక్షతో వచ్చాడని – బలి రావణుని పిలిచి తన తొడమీద కూర్చోబెట్టుకున్నాడని – వచ్చిన పని అడిగితే చెప్పలేక, విష్ణుమూర్తి నిన్ను మాయ చేసాడని విని వచ్చానన్నాడని – చూపించమని కోరితే – మొదటి ద్వారం దగ్గర చూసిన వాడే విష్ణువని – విష్ణు మహత్యాన్ని బలి వివరించాడని భాగవతంతోపాటు ఉత్తర రామాయణంలోని కథ చెప్తోంది!.

– బమ్మిడి జగదీశ్వరరావు