జిమ్ ట్రైన‌ర్‌ను చిత‌క‌బాదిన కేసులో…. కన్నడ హీరో విజయ్ అరెస్ట్

క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ జిమ్ ట్రైన‌ర్‌ను చిత‌క‌బాదిన కేసులో విజ‌య్‌తో పాటు అత‌డి ముగ్గురు స్నేహితుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధితుడి బంధువు కిట్టి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మొత్తం న‌లుగురిని అరెస్ట్ చేసిన‌ట్లు అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్ ర‌వి శంక‌ర్ మీడియాకు వివ‌రించారు. అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు 14 రోజుల పాటు మెట్రోపాలిట‌న్ జ‌డ్డి వీరికి జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించారు. త‌ద‌నంత‌రం వీరిని సిటీ సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లించారు.

శ‌నివారం రాత్రి అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఓ బాడీ బిల్డింగ్ ఈవెంట్‌కి న‌టుడు దునియా విజ‌య్, జిమ్ ట్రైన‌ర్ మారుతీ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఒక చిన్న‌విష‌యంలో త‌లెత్తిన అభిప్రాయ‌భేదాలు కొట్టుకునేదాక వెళ్లాయి.

బాధితుడు ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. మారుతీ గౌడపై తాను దాడి చేయ‌లేద‌ని… త‌న‌ను దూషించ‌డంతో త‌న ఫ్యాన్స్ చేయిచేసుకున్నార‌ని దునియా విజ‌య్ పోలీసులకు తెలిపాడు.

స్టంట్ మాస్టర్స్ చ‌నిపోయిన కేసులో విచార‌ణ‌

2016లో విజ‌య్ హీరోగా…. షూటింగ్ సమయంలో ఇద్ద‌రు స్టంట్ మాస్ట‌ర్స్ నీటిలో మునిగి చ‌నిపోయారు. ఈ కేసు ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉంది. పోలీసులు విజ‌య్‌ను ప‌లు సార్లు విచారించారు. జూన్ 8న అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం విజ‌య్ బెయిల్‌పై ఉన్నాడు.

ధ‌నిక యాక్ట‌ర్ల‌లో ఒక‌డు

ప‌దేళ్ల క్రితం దునియా అనే చిత్రంలో న‌టించిన విజ‌య్ సూప‌ర్ హిట్ కొట్టాడు. అక్క‌డ నుంచి అత‌డి పేరు దునియా విజ‌య్‌గా మారిపోయింది. చందా, జంగ్లీ, జానీ మేరా నామ్….ప్రీతి మేరా కామ్ వంటి హిట్ చిత్రాల్లో విజ‌య్ న‌టించాడు. కోట్లాది రూపాయ‌ల రెమ్యూనరేష‌న్ అందుకుంటున్నాడు.

భార‌త‌దేశంలో అత్యంత ధ‌న‌వంతులైన సినీ న‌టుల్లో విజ‌య్ కూడా ఉన్నాడు. ఫోర్బ్స్‌ మ్యాగ‌జైన్ రూపొందించిన జాబితాలో స్థానం ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం దునియా విజ‌య్ ఆస్థి 151 కోట్లు.