ఇలా హింసించడం కరెక్ట్ కాదేమో జగన్

హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నట్టేట ముంచేశాయి. హోదాకు బదులు ప్యాకేజ్ అంటూ చెవుల్లో క్యాబేజ్ పెట్టారు. అయితే ఇప్పటికీ ప్రత్యేక హోదాకోసం జగన్‌ మాత్రమే గట్టిగా పోరాటం చేస్తున్నారు. సాధారణంగా మరో నేత అయితే ఈ పాటికి హోదాపై పోరాటాన్ని మానుకునే వారు. కానీ జగన్‌ మాత్రం మొండిగా ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే యువభేరి పేరుతో జిల్లాలు తిరుగుతూ విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. చాలా మంచి ఆలోచనే. కానీ ఆ ఆలోచనను అమలు చేస్తున్న తీరే బలవంతంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షలా తయారైంది. జగన్‌ను చూద్దామని వచ్చిన స్టూడెంట్స్ ఇంకా ఎంతసేపు ఇలాగే కూర్చోవాలన్న అసహనానికి లోనయ్యేలా కార్యక్రమం నిర్వాహణ ఉంటోంది. ఏలూరులో జరిగిన యువభేరినే గమనిస్తే విద్యార్థులను హోదా విషయంలో చైతన్యపరచాలన్న ప్రయత్నంలో జగన్ కొన్ని చిన్నచిన్న విషయాలనే మరిచిపోయారనిపిస్తోంది. యువభేరికి వచ్చిన వారంతా మేధావులు కాదు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న టీనేజర్లు. అలాంటి వారి ముందు మాట్లాడేటప్పుడు వారికి ఏ విషయాలు ఎక్కుతాయో పరిశీలించుకోవాలి. ఎంతసేపు మాట్లాడితే చిన్నారులు బోర్‌గా ఫీల్‌ కాకుండా ఉంటారో ముందే గడువు పెట్టుకోవాలి. ఎలాంటి పదాలు ప్రసంగంలో వాడితే స్టూడెంట్స్ ఉత్సాహంగా వింటారో గమనించాలి. ప్రసంగం విషయంలో జగన్‌కు సహకరించే పార్టీ మీడియా సెల్ వ్యక్తులకు కూడా  కనీసం ఆ ఆలోచన ఉండాలి. కానీ..

ఏలూరు యువభేరిలో జగన్ ప్రసంగంలో ఆ మూడు అంశాలు కనుమరుగయ్యాయి. సభకు వచ్చిన వారంతా తలపండిన మేధావులన్నట్టు వారి ముందు ఆర్థిక సంఘం, ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్, పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీ ఇలాంటి పెద్దపెద్ద అంశాలను సుధీర్ఘంగా మాట్లాడితే ఆ విద్యార్థులకు అర్థమవుతాయా?. పార్లమెంట్‌లో హోదాపై ఏ ఎంపీ ఎప్పుడు ఏం ప్రశ్న అడిగారు?. దానికి కేంద్రమంత్రులు ఏం సమాధానాలు చెప్పారు వంటి అంశాలకు సంబంధించిన కాగితాలు తెచ్చుకుని ఇంగ్లీష్‌ వాటిని అప్పటికప్పుడు చదివి వినిపిస్తే విద్యార్థులకే కాదు ఒకింత పెద్దవాళ్లకు కూడా ఎక్కదు. యువభేరికి వచ్చిన వారంతా ఉడుకునెత్తురు ఉన్న విద్యార్థులు. అలాంటి వారి దగ్గర కూడా మేధావులకు చెప్పాల్సిన విషయాలు చెబుతూపోతే ఉపయోగం ఉంటుందా?. హోదా దగ్గర మొదలుపెట్టి, పోలవరం, పరిశ్రమలు, రైతులు, డ్వాక్రా రుణాలు, నిరుద్యోగాలు వరకు ఇలా అన్ని విషయాలు ఒకే భేరిలో మోగిస్తే అవన్నీ రికార్డు చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి విద్యార్థులు రోబోలు కాదు కదా!.

ప్రత్యేక హోదా లాభాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని వివరించాలంటే 15 నిమిషాలు చాలు. అలా చేయకుండా హోదాపై ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్‌ కాగితాల ద్వారా విద్యార్థులను అలా ఒక హాలులో కూర్చోబెట్టి  దాదాపు గంటన్నర ( మధ్యాహ్నం 12.51కి మొదలుపెట్టి 2.20 గంటలవరకు) పాటు  వివరిస్తే యువభేరి అసలు ఉపయోగానికే ఎసరు రాదా?. అది కూడా సరిగ్గా లంచ్‌ టైమ్‌లో ( జగన్ గారి ప్రతి యువభేరి ఇలా విద్యార్ధులు ఆకలితో ఉండే సమయంలో పెడుతున్నారు ) ఇలా సుధీర్ఘ ప్రసంగం చేస్తే విద్యార్థులు ఎలా ఫీల్ అవుతారో గమనించుకోవడం మంచిది. జగన్‌ ప్రసంగం మొదలుపెట్టిన సమయంలో విద్యార్థుల స్పందనకు గంటన్నర ప్రసంగం ముగిసే సమయంలో వారి స్పందన, వారి ముఖాల్లో కవళికలను పరిశీలిస్తే కార్యక్రమం సుధీర్గంగా సాగడం వల్ల విద్యార్థులు ఎలా ఫీల్ అయ్యారో అర్థమవుతుంది.   మరోసారి యువభేరి నిర్వహించేటప్పుడు అయితే సూటిగా మాట్లాడి, శాతాలు, తేదీలు, జీవోలు, స్టేట్‌మెంట్ల ఇంగ్లీష్ కాపీలను చదవకుండా ఉంటే స్టూడెంట్స్‌ కాస్త తేలిగ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు గంటలు గంటలు ప్రసంగాలు చేసే వ్యక్తిగా చంద్రబాబు పేరున ఉన్న రికార్డు బద్దలయ్యే అవకాశం రాకుండా ఉంటుంది.  విద్యార్థుల మానసిక స్థితి, వారు అర్థం చేసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని యువభేరీలు నిర్వహిస్తే హోదా సాధనలో అంతోఇంతో ఉపయోగం ఉంటుంది.  లేదంటే యువభేరిలో  భేరీ మాయమయ్యే  ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఎంత పోరాటం చేసినా విద్యార్ధులకు ఎక్కదు.

Click on Image to Read:

kcr-chandrababu-naidu

ias-katamaneni-bhaskara-rao

amaravathi-formers