బ్రాండ్ అంబాసిడర్ గా మారిన గోపీచంద్

హీరో గోపీచంద్ ఫస్ట్ టైమ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ప్యూర్ లైఫ్ హెల్త్ సర్వీసెస్ అందిస్తున్న వెల్ కేర్ హెల్త్ కార్డ్ కు ప్రచార కర్తగా వ్యవహరించడానికి గోపీచంద్ అంగీకరించాడు. అయితే ఇదేదో కమర్షియల్ ఎండోర్స్ మెంట్ కాదు. సంస్థ ప్రైవేటు రంగానికి చెందినదే అయినప్పటికీ… ఓ మంచి ఉద్దేశంతో ఈ హెల్త్ కార్డ్ సర్వీస్ ను ప్రారంభించింది. అందుకే గోపీచంద్ ఈ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ముందుకొచ్చాడు. అది కూడా పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా.

వెల్ కేర్ హెల్త్ కార్డ్ ప్రచారం త్వరలోనే ప్రారంభం అవుతుంది. పేదలకు ఆరోగ్య సేవలకు, తక్కువ ధరకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఏడాదికి కేవలం 999 రూపాయలు కడితే… అన్ని రకాల చికిత్స సదుపాయాల్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ప్రభాస్ ప్రారంభించబోతున్నాడు. గోపీచంద్ ప్రచార కర్తగా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో సినిమా తోపాటు, ఆక్సిజన్ అనే మరో ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. అటు ప్రబాస్, బాహుబలి-2తో బిజీగా ఉన్నాడు. ఈ మంచి కార్యక్రమం కోసం ఈ ఇద్దరు మిత్రులు ఇలా కలిశారన్నమాట.