రోడ్డుపై ముద్దులు.. వ‌ద్ద‌న్న‌వారికి గుద్దులు!

పీక‌ల‌దాకా మ‌ద్యం తాగాక‌.. బైక్ పై రోడ్డెక్కారు ఓ యువ‌ జంట‌. ఒళ్లు తెలియ‌ని స్థితిలో రోడ్డుపై హ‌ద్దులు దాటి ముద్దులు పెట్టుకోసాగారు. జ‌నాల‌ను గుద్దుకుంటూ ఇష్టానుసారంగా బండి న‌డిపారు. ఇదేంట‌ని అడిగిన వారిని పిడిగుద్దుల‌తో దాడి చేశారు. అడ్డుకున్న పోలీసుల‌పై దాడి చేశారు. లాభం లేద‌ని వీరిని పోలీసుస్టేష‌న్‌కు త‌ర‌లిస్తే.. అక్క‌డా సోయి మ‌రిచి ముద్దులు, కౌగిలింత‌ల‌తో రెచ్చిపోయారు.  ఈ అస‌హ్య‌క‌ర‌మైన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని వేలూరులో జ‌రిగింది. 
వివ‌రాలు.. వేలూరు అన్నాసాలైలో సోమవారం మధ్యాహ్నం ఒక యువ జంట మద్యం మత్తులో బైకుపై రోడ్డెక్కారు. అంద‌రినీ ఢీకొట్టుకుంటూ అడ్డ‌దిడ్డంగా బండి న‌డిపారు. రోడ్డుపై ముద్దుల‌తో రెచ్చిపోయారు. త‌రువాత‌ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగారు. ఇదేంట‌ని ఓ వాహ‌న‌దారుడు ప్ర‌శ్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువ‌తి స‌ద‌రు వాహ‌న‌దారుడిపై దాడి చేసింది. అక్క‌డే విధులు నిర్వ‌హిస్తున్న ఎస్‌.ఐ. రాజ్‌కుమార్ ఆ యువ‌తిని అడ్డుకున్నాడు. అంతే ఆ యువ‌తి ఎస్‌.ఐ.పైనా దాడి చేసింది. దీంతో వెంట‌నే నార్త్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఎస్‌ఐ నిర్మల వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా ఆ యువతి ఆమెపైనా దాడిచేసినట్లు పోలీసులు చెప్పారు. త‌రువాత వారిని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించ‌గా అక్క‌డా సిబ్బందిపై దాడికి ప్ర‌య‌త్నించారు. ఆపై సోయి మ‌రిచి అక్క‌డే ముద్దులు పెట్టుకోవ‌డం ప్రారంభించారు. వెంటనే పోలీసులు వారిని వేరుచేసి అతని వద్ద ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరిశీలించారు. అతను తుత్తిపట్టు కామరాజనగర్‌కు చెందిన వివేకానంద్‌ అని, ఆ యువతి బెంగుళూరుకు చెందిన అర్చనగా గుర్తించారు. వీరిద్ద‌రిపై కేసులు న‌మోదు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.