పండగ చేసుకుంటున్న పెళ్లిచూపులు టీం

ఈమధ్య కాలంలో ఇంతకంటే చిన్న సినిమా ఇంకోటి రాలేదు. చిన్నగా వచ్చి పెద్ద హిట్ సాధించిన సినిమా కూడా ఈమధ్య కాలంలో లేదు. అలా పెళ్లిచూపులు సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. కేవలం 60లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రచారానికి మళ్లీ అంతే ఎమౌంట్ ఖర్చుపెట్టారు. అంటే… దాదాపు సినిమా బడ్జెట్ ప్రచారంతో కలుపుకొని కోటీ 20లక్షలన్నమాట. ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లోనే అంత  మొత్తాన్ని సంపాదించింది. అంతేకాకుండా… ఏపీ, తెలంగాణలో కలుపుకుంటే దాదాపు 5కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. అంటే… కోటి 20లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన సినిమాకు ఇప్పుడు ఏకంగా 6కోట్ల రూపాయల లాభాలు వచ్చాయన్నమాట. ఇదే పెద్ద మొత్తం అనుకుంటే.. ఇప్పుడీ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా రెండు కోట్ల 35 లక్షల రూపాయలకు అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. అవును… జెమినీ టీవీ ఇంత మొత్తం పెట్టి పెళ్లిచూపులు శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. దీంతో సినిమా యూనిట్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది. తాజా విజయంతో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రీతూవర్మలు ఊహించని అఫర్లు దక్కించుకుంటున్నారు. విజయ్ దేవరకొండ అయితే ఏకంగా పవన్ సినిమాలో నటించే అవకాశానికి దగ్గరగా ఉన్నాడు. అటు రీతూవర్మకు కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి.